ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండు అధికార పార్టీల మధ్య వార్ నడుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య కొంత కాలంగా పచ్చగడ్డి వేస్తే మండిపోతుందా… అన్నంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనపడుతున్నాయి. కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్ గ్రానైట్ వ్యాపారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ టార్గెట్‌గా ఈ ఆరోపణలు సంధించారు. గ్రానైట్ వ్యాపారులు దాదాపు 749 కోట్ల రూపాయిల పన్నులు ఎగ్గొట్టారని, ఎంపీ సంజయ్ కేంద్ర రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు సైతం ఆయన లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. దీని పైన విచారణ జరపాలని గవర్నర్‌ను కోరారు. ఈ క్రమంలో బీసీ వెల్ఫేర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేరు ప్రస్తావించినా… అప్పటికీ ఆరుగురు మంత్రులకు ఈ గ్రానైట్ స్కాంలో ప్రమేయం ఉందని వారి పైన విచారణ జరుపుతామని సరైన చర్యలు తీసుకుంటామని ఆయన బహిరంగంగానే చెప్పారు. దాంతో ఎవరా ఆరుగురు మంత్రులు అన్న చర్చ జోరందుకుంది.
దీనిపై గంగుల కమలాకర్ సైతం కరీంనగర్ లోక్‌సభ సభ్యుని పై ప్రత్యారోపణలు చేశారు. ఈ క్రమంలో లో కరీంనగర్ జిల్లా గ్రానైట్ వ్యాపారుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్ ర్ ఇచ్చిన పిలుపు మేరకు మూడు రోజుల పాటు గ్రానైట్ వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. తాము సక్రమంగానే వ్యాపారం చేస్తున్నామని, చట్టబద్ధంగా అన్ని అనుమతులు తీసుకుని తమ వ్యాపారం కొనసాగిస్తుంటే కరీంనగర్ ఎంపీ గ్రానైట్ వ్యాపారులను కించపరిచేలా తన ఫిర్యాదులో పేర్కొన్నాడని ఆరోపించారు. ఈ క్రమంలో లో ఖమ్మం, వరంగల్ గ్రానైట్ వ్యాపారులు సైతం బందులో పాల్గొంటున్నారు. అయినా… ఎంపీ సంజయ్ వెనక్కు తగ్గలేదు. తప్పుచేసిన వారు ఎవరైనా సరే శిక్షణ అనుభవించాల్సిందేనని సంజయ్ స్పష్టం చేస్తున్నారు.
తమపై వచ్చిన ఆరోపణల సంగతి అటుంచి… ఎంపీ సంజయ్ నిర్వహిస్తున్న మహాశక్తి ఆలయంలో అవకతవకలు జరిగాయంటూ టీఆర్ఎస్ ఎదురుదాడి ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన హిందూ ఏక్తా యాత్రకు డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అంటూ ప్రశ్నిస్తోంది. దీంతో… కరీంనగర్‌లో ఇరు పార్టీల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎంపీ సంజయ్ ఆలయ నిర్మాణాలను అడ్డంపెట్టుకొని అక్రమ సంపాదన చేస్తున్నారని అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షాలను కూడా కలుస్తామని టీఆర్ఎస్ నేతలు, గ్రానైట్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.