కన్న కూతురును కోల్పోయి ప్రియాంక రెడ్డి కుటుంబం పుట్టెడు దు:ఖంలో ఉంటే..రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. బాధితులకు ఓదార్పు మాటలు చెప్పి వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయి డాక్టరై ఉండి కూడా పోలీసులకు ఫోన్ చేయకుండా చెల్లెలికి ఫోన్ చేయడమేంటని సాక్షాత్తూ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మహమూద్ అలీ మాటలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మంత్రి మాట్లాడిన కొద్ది సేపటికే మరో మంత్రి తన నోటి దురుసును ప్రదర్శించారు. రక్షణ కోసం ఇంకేం చేయగలం..? ఇంటికో పోలీసును పెట్టాలా అంటూ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలకు రక్షణ కరువైందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండడంతో వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రభుత్వ పెద్దలు అసహనం ప్రదర్శిస్తున్నారు.