వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రంగా మండిపడ్డారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే.. టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించదన్నారు బాల్క సుమన్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంస్కార హీనంగా మాట్లాడితే.. ఏమైనా జరగొచ్చు అని బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. షర్మిల అడ్డగోలుగా మాట్లాడే భాషే ఇందకు కారణమన్నారు. కావాలనే ఆమె రెచ్చగొట్టినట్టు మాట్లాడారని మండిపడ్డారు.
మా సహనానికి ఓపికకు హద్దు ఉంటది. రాబోయే రోజుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదు. తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియనట్టున్నారు. ఎవరిని పడితే వాళ్లను.. ఏది పడి అది మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే.. నల్లి లాగా నలిపేస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డమీదకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెవులు మూసుకొను కూర్చోవాలా ? అసలెవరీ షర్మిల. ఆమెకు తెలంగాణ గురించి ఏం తెలుసు? అంటూ నిలదీశారు
గతంలో హైదరాబాద్ ను పాకిస్థాన్ తో పోల్చారు షర్మిల. ఇప్పుడు అప్ఘనిస్థాన్ తో పోల్చుతున్నారు. హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాలని అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో వందల ఎకరాలు కబ్జా చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం తెలంగాణకు వ్యతిరేకం. వైఎస్ జగన్ కూడా పార్లమెంట్ లో తెలంగాణను వ్యతిరేకించారు. ఏపీ నుంచి వచ్చిన మహిళ, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న షర్మిల చెబితే ఎవరైనా నమ్ముతరా ?
షర్మిల మాట్లాడే మాటలు ఆడపిల్లలు మాట్లడే భాషేనా? తమ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై జరిగిన దాడి గురించి గవర్నర్‌కు తెలియదా?. తమను షర్మిల దూషించిన విషయం కూడా గవర్నర్ తెలియదా ?. సంస్కారహీనంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నా ఏం మాట్లాడొద్దా?. మా ఎమ్మెల్యేలపై షర్మిల మాట్లాడినప్పుడు గవర్నర్ కు కనిపించడం లేదా? ఇప్పుడు ఆమెకు ఏదో జరిగినట్టు మాట్లాడుతున్నారు. అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్.