హుజురాబాద్ లో ఎలాగైన గెలవాలన్న కసితో ఉన్న టీఆర్ఎస్ అన్ని దారులను వెతుకుతోంది. మండలానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా పెట్టిన టీఆర్ఎస్… కమలాపురం మండలానికి ధర్మారెడ్డిని నియమించింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డి దళితుల ఓట్ల కోసం ఏకంగా టీఆర్ఎస్ కు ఓటు వేయాలని కొన్ని దళిత కుటుంబాలతో ప్రతిజ్ఞ చేయించారు.
కమలాపూర్ మండలం గూడూరులో మాల సామాజిక వర్గానికి చెందిన వారితో టీఆర్ఎస్ నేతలు ప్రమాణం చేయించారు. టీఆర్ఎస్ కే ఓటు వేయాలని చేతులు చాచి మరీ శపథం చేయించారు. అంతేకాదు కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని వారినోట పలికించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చాలా గ్రామాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ఇలాగే ప్రతిజ్ఞలు చేయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులతో ప్రమాణం చేయించడం పై దళిత మేధావులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.