యధా కేసీఆర్.. తధా ఎమ్మెల్యేలు అన్నట్టు ఉంది తెలంగాణలో అధికార టీఆర్ఎస్ నేతల తీరు. ఆ మధ్య ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కు దారి కోసం ఏకంగా ఓ రైతు పొలం మధ్య నుంచి అక్రమంగా రోడ్డు నిర్మించిన సంగతి గుర్తుందా.. ఆ వివాదం సద్దమణిగిందో లేదో తెలియదు కానీ.. కేసీఆర్ చూపిన ఆ అక్రమణ బాటలోనే ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుస్తున్నారు.
భూకబ్జాల ఆరోపణలతో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఇప్పుడు మరోసారి ఘనకార్యం చేశారని చెప్పుకుంటున్నారు. రోడ్డుకు దూరంగా ఉన్న తన ఫాంహౌస్ భూముల ధరలు పెంచుకునేందుకు చాలా తెలివిగా ఇతర రైతుల పొలాన్ని ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా తనపై ఏ మాత్రం విమర్శలు రాకుండా పకడ్బందీగా తన కబ్జా కార్యక్రమాన్ని పూర్తి చేశారని అంటున్నారు.
ఎర్రవల్లిలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఉన్నట్టుగానే.. జనగామ జిల్లా నర్మెట్ట మండలం హన్మంతాపూర్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా ఓ ఫామ్‌హౌస్ ఉంది. అయితే అక్కడికి వెళ్లేందుకు ఉన్న రోడ్డు ఇరుకుగా ఉంటుంది. తన వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందిగా ఉందని భావించని ముత్తిరెడ్డి.. రోడ్డును ఎలాగైనా విస్తరించుకోవాలని అనుకున్నారు. రైతులని భూమి అడిగితే ఉచితంగా ఇవ్వరు. నష్టపరిహారం ఇవ్వాలన్నా.. డబ్బులు ఖర్చయిపోతాయి. దీంతో ఓ మాస్టర్ ప్లాన్ వేశారట ముత్తిరెడ్డి. హరితహారం పేరుతో రోడ్డు వెంట మొక్కలు నాటే పేరుతో రోడ్డు విస్తరణ చేపట్టేశారు. రైతుల పొలాల్లోని పంటలను తొలగించి.. రోడ్డు విస్తరించేశారు. ఇరువైపులా రైతులకు సంబంధించి 45 ఫీట్ల వరకు పొలాలను అనధికారికంగా, అక్రమంగా సర్కార్ పని పేరుతో స్వాహా చేసేశారు. అలా అక్రమంగా వేసుకున్న రాచబాట వెంట.. స్వయంగా దగ్గరుండి మొక్కలు నాటించారు ముత్తిరెడ్డి.
భూమి ఇచ్చేందుకు తాము అంగీకరించకపోయినా.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి బలవంతంగా జేసీబీలతో తమ పొలాలను చదును చేయించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, పైగా ఎమ్మెల్యేకే అనుకూలంగా మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా విషయం మీడియా వరకు చేరడంతో.. కొంత మంది రైతులను పిలిపించుకుని ముత్తిరెడ్డి వారిని సమాధానపరిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే చాలా మంది రైతులు మాత్రం ముఖ్యమంత్రి స్పందించి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు