తొలివెలుగు ఎక్స్‌క్లూజివ్:
టీఆరెఎస్ అధిష్టానంపై ఎమ్మెల్యే మైనంపల్లి అసంతృప్తితో ఉన్నారా…? సరైన సమయంలో టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వబోతున్నారా…? మంత్రి పదవి ఇస్తానని మోసం చేశారన్న ఆవేదనలో మైనంపల్లి ఉన్నారా…?
టీఆర్ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్త జ్వాలలు ఒక్కోటిగా భయటపడుతున్నాయి. తనకు హమీ ఇచ్చి, విస్మరించారన్న అసంతృప్తితో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం చేపట్టిన సీఎం కేసీఆర్… మైనంపల్లికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని జోరుగా ప్రచారం సాగింది. సీఎం హమీ మేరకే మైనంపల్లి అనుచరులు మంత్రి పదవి ఖాయం అని ప్రచారం చేసుకున్నారని టీఆర్ఎస్‌లో పెద్ద చర్చే సాగింది.
మొదటి విడతలో గత క్యాబినెట్‌లో ఉన్న నగర మంత్రి పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటంతో… తమకు లైన్ క్లియర్ అయ్యిందని, రెండోసారి విస్తరణలో తమకు అవకాశం ఉంటుందని మైనంపల్లి సహా తన వర్గీయులు భావించారు. కానీ అనూహ్యంగా సీఎం కేసీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అవకాశం ఇవ్వటంతో మైనంపల్లి అవమాన భారంతో ఉన్నారని పార్టీ వర్గాల టాక్. ఆనాటి నుండి సీఎం కేసీఆర్‌తో పాటు పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు మైనంపల్లి.
తాజాగా సీఎం ప్రతిష్టాత్మకంగా ఓపెనింగ్ చేసిన మెట్రో రెండో దశ కారిడార్ ఓపెనింగ్‌లో… హైదరాబాద్ ఎమ్మెల్యేలు, చోటా మోటా లీడర్లంతా నానా హాడావిడి చేశారు. కానీ కేసీఆర్ పర్యటన అంటే ముందుండే మైనంపల్లి మాత్రం కనపడలేదు. దీంతో మైనంపల్లి అసంతృప్తి ఇప్పుడు మరోసారి చర్చనీయాంశం అవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల వరకు గ్రేటర్ బాధ్యతలన్నీ మైనంపల్లే మోశారని, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విక్టరీ వెనుక మైనంపల్లి కృషి ఉందని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.
మంత్రి పదవుల విషయంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితో పాటు పాలమూరులో ఓ నేత కూడా అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో… మైనంపల్లి తాజా ఎపిసోడ్ రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.