తెలంగాణ రాజకీయాల్లో సంచలనం నమోదయ్యే అవకాశం ఉందా…? బెంగుళూరు డ్రగ్స్ రాకెట్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లింకు ఉన్నట్లు బెంగళూరు పోలీసుల విచారణలో తేలిందా…? మొత్తం ఐదుగురి ఎమ్మెల్యేల్లో ముగ్గురి అరెస్ట్ తప్పదా…?
ఉద్యమకారుడిగా చెప్పుకునే ఓ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు బెంగుళూరు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు గుర్తించారు. బలమైన ఆధారాలు సేకరించే పనిలో ఉన్న పోలీసులు… త్వరలో అరెస్ట్ కు రెడీ అవుతున్నారని, పక్కా ఆధారాలతో అరెస్ట్ లు చేయబోతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి.
సినిమాలకు ఫైనాన్స్ చేస్తూ, క్యాబ్ ల వ్యాపారం చేసే నేతకు కూడా సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వీరు రెగ్యూలర్ గా బెంగుళూరు ప్రయాణాలు చేయటం, కొందరు అక్కడ బిజినెస్ లు కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
నిజానికి హైదరాబాద్ లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసు ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. మొదట హాడావిడి చేసిన అబ్కారీ శాఖ… ఆ తర్వాత లైట్ తీసుకుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే ఆ కేసు నీరుగారిపోయిందన్న విమర్శలు వచ్చాయి. కానీ ఈసారి పక్కరాష్ట్రంలో మన నాయకుల మత్తు బాగోతం ఎంత వరకు వస్తుందో చూడాలి.