స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య యమ జోరు మీదున్నారు. తన నియోజకవర్గంలో టీఆర్ఎస్ సభ్యత్వాలు 60 వేలు చేయించాకే తాను గడ్డం తీస్తానంటూ శపథం చేసి ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన రాజయ్య… అదే హుషారులో ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో నోరు జారి.. నవ్వులపాలయ్యారు.
వరంగల్- ఖమ్మం- నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జనగామ జిల్లాలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజయ్య టంగ్ స్లిప్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఒక్కసారిగా అక్కడున్న వారు రాజయ్య మాటలకు షాక్ అయ్యారు. దీంతో వెంటనే తన తప్పు తెలుసుకున్న రాజయ్య.. టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని సరిచేసుకున్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. రాజయ్య మాటలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజయ్యలాంటి టీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్‌కు ఓటేయ్యాలని చెప్పిన తర్వాత.. ఇంకా పల్లాకు ఓటు వేయడం ఎందుకు అంటూ సెటైర్లు వేస్తున్నారు.