టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు.
రాజకీయాల్లోకి రాకముందు రామలింగారెడ్డి జర్నలిస్టుగా పని చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న నేతల్లో ఆయన ఒకరు. 2004, 2008లో దొమ్మాట నుంచి.., 2014, 2018లో దుబ్బాక నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్‌గా రామలింగారెడ్డి వ్యవహరిస్తున్నారు.
కొంతకాలంగా రామలింగారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆయన కాలికి ఆపరేషన్ జరిగింది. చికిత్స తర్వాత ఇన్‌ఫెక్షన్ కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో అర్దరాత్రి మరణించారు. రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.