కేటీఆర్ పట్టాభిషేకం వాయిదా!
చిన్న తాయిలాలతో ప్రస్తుతానికి సరి
ఛీఫ్ విప్‌గా దాస్యం.. విప్‌లుగా రేగా, గొంగిడి, గంప, గువ్వల, గాంధీ, సుమన్
ఎంఐఎంకు పీఏసీ పోస్ట్ !
హైదరాబాద్: ఓపక్క రైతులు ఆత్మహత్యలు, యూరియా దొరక్క అవస్థలు, మరోపక్క రాష్ట్రమంతటా విష జ్వరాలు, వీటికి తోడు యాదాద్రిలో బొమ్మల బాగోతం.. వీటన్నింటి దృష్ట్యా ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వున్న ప్రస్తుత తరుణంలో కేటీఆర్ పట్టాభిషేకాన్ని మరికొన్నాళ్లు వాయిదా వేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి పార్టీలో వున్న అసంతృప్తులను చల్లబరచడానికి ప్రయత్నం జరిగినట్టుగా తాజా నియామకాలను బట్టి అర్ధం అవుతోంది.
9వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను ముందుగా ఖరారు చేశారు. ప్రభుత్వ ఛీఫ్ విప్‌గా దాస్యం వినయభాస్కర్ నియమితులయ్యారు. విప్‌లుగా గొంగిడి సునిత, గంప గోవర్థన్, గువ్వల బాలరాజు, అరికెపూడి గాంధి, రేగ కాంతారావు, బాల్క సుమన్‌లను నియమిస్తూ కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.
ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ప్రభుత్వ విప్‌గా నియమిస్తున్నట్టు ముందే వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో రేగా హుటాహుటీన హైదరాబాద్ బయల్దేరి వచ్చారు.
మంత్రివర్గ విస్తరణకు ఇంకా జాప్యం జరిగే అవకాశం వుందని తెలుస్తోంది. మరోపక్క శాసనసభ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ శాసనసభ ఏర్పాటై ఎనిమిది నెలలు దాటినా.. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మినహా ఇతర కమిటీల నియామకం జరగలేదు. శాసనసభ నిబంధనల ప్రకారం ఆర్థిక, సంక్షేమ, ఇతర రంగాలకు సంబంధించి 19 రకాలైన కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా పబ్లిక్ అకౌంట్స్, అంచనాలు, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలు ఉన్నాయి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో మొత్తం 13 మంది సభ్యులకుగాను తొమ్మిది మంది శాసనసభ, నలుగురు శాసన మండలి నుంచి ఎన్నిక అవుతారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేకు ఇస్తారు. ఈ ఆనవాయితీని కాదని, మిత్రపక్షానికి పీఏసీ పదవి ఇవ్వనున్నారు. 119 మంది ఎమ్మెల్యేలు గల అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యులు, కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు వున్నారు. 12 మంది చీలిక వర్గం ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం హోదాను కోల్పోయింది. ఏడుగురు సభ్యులున్న ఏఐఎంఐఎం అసెంబ్లీలో ‘అతి పెద్ద రెండో పార్టీ’గా వుంది. ఎంఐఎం ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది.