బంగారు తెలంగాణ కాస్తా.. బారుల తెలంగాణ అయిందనే విమర్శలున్నాయి. ఎక్కడబడితే అక్కడ వైన్స్, బార్స్ తో తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారని నిత్యం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తిట్టిపోస్తూనే ఉంటాయి. అయితే.. ఎన్ని విమర్శలు వచ్చినా అధికార పార్టీ నేతలకు కాస్త కూడా పట్టింపు లేనట్టుగా ఉంది. హోలీ సందర్భంగా జరిగిన సంఘటనే అందుకు నిదర్శనం.
దేశ ప్రజలు హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ హోలీ వేడుకల్ని అభిమానులతో పంచుకున్నారు. కానీ.. నా రూటే సపరేటు అన్నట్లు.. మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
పండుగను మంచిగా జరుపుకొని అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే.. మందు బాటిల్ తో నడిరోడ్డుపై హల్ చల్ చేశారు. హోలీ వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నాక.. పార్టీ కార్యకర్తల నోట్లో మందు పోస్తూ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు ఎమ్మెల్యే శంకర్ నాయక్.
పార్టీ ఆఫీస్ దగ్గరే బాక్సులకు బాక్సులు బీర్ బాటిల్స్ కూడా కనిపించాయి. హోలీ సందర్భంగా రాష్ట్రంలో మద్యం షాపులు బంద్ చేసింది ప్రభుత్వం. అయితే.. ఎమ్మెల్యే మాత్రం మందు బాటిల్ పట్టుకుని ‘‘తెరవరా నోరు.. పోస్తా మందు’’ అన్నట్టుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.