టీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న కుమ్ములాటలు వీధికెక్కుతున్నాయి. నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరుతో క్యాడర్ లోనూ చీలిక తెస్తోంది. ఎంతోకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి- ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గాల పోరు బహిర్గతం అయ్యింది.
తాండూరు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు.
గొడకు కారణం ఏంటంటే…
కార్యాలయం వద్ద అభివృద్ధి అంశంపై ఇద్దరు మహిళా కౌన్సిలర్లు చర్చించుకుంటున్నారు. ఈ సంభాషణలో మున్సిపల్ పరిధిలో అభివృద్ధి కుంటుపడుతోందని మహిళా కౌన్సిలర్ల చర్చించుకుంటుండగా, మహిళా కౌన్సిలర్ల సంభాషణ విని ఎమ్మెల్సీ వర్గీయుడు ఆగ్రహం వ్యక్తం చేయటంతో గొడవ ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్సీ వర్గీయుడిపై ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్ భర్త ఆగ్రహం వ్యక్తం చేయటంతో నేతల మధ్య మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య పరస్పర దాడుల వరకు దారి తీసింది.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి, తన వర్గం నేతలతో టీఆర్ఎస్ లో చేరిన నాటి నుండి తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఆధిపత్య పోరు మొదలైంది.