కబ్జాల్లో కింగ్ లుగా మారిన గులాబీ నేతలు.. బూతుల్లోనూ పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారింది. తాజాగా రంగారెడ్డి జిల్లా తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్న ఆడియో ఒకటి బయటకొచ్చింది. ఫోన్ లో పరుష పదజాలంతో ఆయన సీఐని బెదిరించారు. తాండూరు భద్రేశ్వర ఆలయం జాతరలో కార్పెట్ విషయంలో దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. రాయలేని భాషలో సీఐని తిట్టారు మహేందర్ రెడ్డి. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లినా కూడా వదిలిపెట్టనని బెదిరించారు. ఆయన మాటలను సీఐ ఫోన్ లో రికార్డు చేశారు.
మహేందర్ రెడ్డికి ఇది కొత్తేం కాదంటున్నారు ప్రతిపక్ష నేతలు. గత ఎన్నికల్లో రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు మహేందర్ రెడ్డి. అయితే.. రోహిత్ కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరడంతో మహేందర్ రెడ్డి ఉనికి కోసం సహనం కోల్పోయి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తాండూరు నియోజకవర్గంలో క్రమంగా పట్టుకోల్పోతున్న ఆయన.. అధికారులను లక్ష్యంగా చేసుకుని బూతు పురాణాన్ని ఎంచుకున్నారని చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం గ్రామ పంచాయతీలకు ఫాగింగ్ మిషన్లను పంపిణీ చేసిన సమయంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి సబితారెడ్డి ముందే జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్యపై నోరు పారేసుకున్నారని.. జిల్లాలో ఎలా పనిచేస్తావో చూస్తానంటూ బెదిరించారని గుర్తు చేస్తున్నారు.
కొద్ది రోజులుగా తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న ఆర్డీఓ అశోక్ కుమార్ ను సైతం మహేందర్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారని చెబుతున్నారు. ఎలాగైనా ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తానని.. లేదంటే సస్పెండ్ చేయిస్తానని పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. అనేక మార్లు ఫోన్లో అశోక్ కుమార్ పై దుర్భాషలాడారని వివరిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.
రెండు రోజుల క్రితం యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ పై ఒక సమావేశంలో బహిరంగంగా బూతులు తిట్టాడని చెబుతున్నారు. అరేయ్.. ఎస్ఐ అంటూ గట్టిగా పలుమార్లు సభావేదిక నుంచే కేకలు వేస్తూ బెదిరించే ప్రయత్నం చేశారని అంటున్నారు. రంజాన్ కిట్ల పంపిణీ సందర్భంగా బషీరాబాద్ మండల తహసీల్దార్ వెంకటస్వామి పై కూడా చిందులేశారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తాండూరు టౌన్ సీఐపై ఫోన్ లో రెచ్చిపోయారని చెబుతున్నారు. ప్రస్తుతం మహేందర్ రెడ్డి బూతు పురాణానికి సంబంధించిన ఆడియో వైరల్ అవుతోంది.