ప్రలోభాలకే ఇది పరాకాష్ట. అధికారమే సిగ్గుపడే చేష్ట. చేతిలో పవర్ ఉంటే ఎంత బరితెగించవచ్చో హుజూరాబాద్ ఉప ఎన్నికతో తొలిసారి ప్రపంచం కళ్లకు కట్టింది టీఆర్ఎస్. దశాబ్ధాల తరబడి దేశంలో జరిగిన అనేకానేక ఉప ఎన్నికలన్నీ చిన్నబోయేలా హుజూరాబాద్‌ను చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ప్రజాస్వామ్యానికి ప్రాణమే ఉంటే ఈ ధన ప్రవాహాన్ని చూసి బహుశా ఆత్మహత్య చేసుకునేదేమో. చీకట్లోనో, తెరచాటుగానో జరిగే పంపిణీ తంతును.. భాజాప్తాగా, బహిరంగంగా అదీ పోలింగ్ రోజున పంచిపెట్టిన ఘనత యావత్ దేశంలోనే ఒక్క టీఆర్ఎస్‌కే దక్కుతుందేమో.
హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలతో ప్రలోభాలకు కొత్త భాష్యం చెప్పింది టీఆర్ఎస్. సాధారణంగా పోలింగ్‌కు ముందురోజు అర్ధరాత్రితో ఇలాంటి తతంగాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ కారు పార్టీ రూటే సెపరేట్ అనిపించుకుంది. ఓ వైపు ఓట్ల పండగ సాగుతోంటే కూడా మరోవైపు టీఆర్ఎస్.. రోజంతా కూడా నోట్ల జాతర చేసింది. పోలింగ్ ముందు రోజు వరకు ఓటుకు రూ.6 వేలే పంచితే.. పోలింగ్ రోజు దాన్ని రెట్టింపు చేసింది. ఒక్కో ఓటుకు రూ.12 వేల చొప్పున ముట్టజెప్పింది. ఓటర్ ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టింది మొదలు పోలింగ్ సెంటర్ల వరకు వెంటాడారు టీఆర్ఎస్ నేతలు. కట్టలకు కట్టల గులాబీ నోట్లను వారి జేబుల్లో పెట్టి, నెట్టి మరీ.. ఓటు వేయాల్సిన గుర్తును గుర్తు చేశారు. కొన్ని చోట్ల అయితే ఏకంగా పోలీసులనే రక్షణగా పెట్టుకుని..పంపకాలు సాగించారంటే ఓట్ల కొనుగోళ్లు ఏం రేంజ్‌లో సాగాయో అర్థం చేసుకోవచ్చు. పార్టీ కార్యకర్తలనే కాదు పోలీసులు, ప్రభుత్వ అధికారులు, మీడియా ప్రతినిధులని సైతం డబ్బుల పంపిణీ కోసం అధికార పార్టీ అడ్డగోలుగా వాడుకుంది. చివరికి కవరేజ్ కోసం వెళ్లే పేరుతో నమస్తే తెలంగాణ రిపోర్టర్లతో పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిల్చున్నవారికి కూడా కవర్లు ఇప్పించింది.
నాన్ లోకల్ లీడర్లు హుజూరాబాద్‌లోకి అడుగుపెట్టేందుకు అనుమతే లేదు. కానీ ఏకంగా పొరుగు జిల్లాలు, నియోజకవర్గాల చెందిన ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు హుజూరాబాద్ వీధుల్లో యధేచ్చగా తిరిగారు. వర్ధన్న పేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఏపీలు.. డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. మంత్రి హరీష్ రావు అనుచరులు కూడా ఎక్కడపడితే అక్కడ తారసపడ్డారు.
మీడియా కంటపడిన దృశ్యాల్లో మచ్చుకు కొన్ని ఇవి!
-జమ్మికుంటలో టీఆర్ఎస్ కౌన్సిలర్ దీప్తి ఇంటి దగ్గర ముగ్గురు నాన్ లోకల్ టీఆర్ఎస్ నేతలు రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టుబడ్డారు. ఆమె ఇంటి పెంట్ హౌస్‌లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సైతం కనిపించినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో ఆయన డబ్బులు పంచినట్టు తెలిసింది.
-కమలాపూర్ మండలం గూడూరు సర్పంచు అంకతి సాంబయ్య ఎవరెవరికీ డబ్బులు ఇవ్వాలో వారిని లిస్టుగా తయారుచేసి మరీ డబ్బులు పంచాడు. స్థానిక యువకులు ఆయన్ను పట్టుకుని 60వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
– జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ డబ్బులు పంచిపెట్టడంతో.. పోలింగ్ కేంద్రాలకు బదులు ఆయన ఇంటి ముందు ఓటర్లు బారులు తీరిన దృశ్యాలు కనిపించాయి.
– జమ్మికుంట మండలం సాయింపేటలో నమస్తే తెలంగాణ ప్రతినిధి డబ్బులు పంచుతూ దొరికారు.
– జమ్మికుంట మండలంలోని కొరపల్లిలో టీఆర్ఎస్ నేతలు కొందరికే డబ్బులు పంచడంతో తమకు రాలేదని స్థానిక ఎంపిటిసి, సర్పంచ్ ఇంటికి తాళం వేశారు గ్రామస్థులు. తమకు ఇవ్వాల్సిన డబ్బును ఇస్తేనే ఓటు వేస్తామని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో పోలీసులు వచ్చి కలగజేసుకోవాల్సి వచ్చింది.
-హుజూరాబాద్ పట్టణంలో డబ్బు పంచుతున్న ఓ వ్యక్తిని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. హనుమాన్ ఆలయం వద్ద డబ్బు పంచుతున్న సమాచారం అందుకున్న కార్యకర్తలు అక్కడికి చేరుకుని సదరు వ్యక్తిని పోలీసులకు అప్పగించాయి. ఆ వ్యక్తి స్థానికేతర టీఆర్ఎస్ కార్యకర్తగా గుర్తించారు.
– శ్రీరాములపల్లిలో టీఆర్ఎస్ నేత మాదాసు శ్రీనివాస్ హల్ చల్ చేశారు. స్థానికేతరుడు అయినప్పటికీ ఓటర్లను ప్రలోభపెడుతూ కనిపించారు. గ్రామస్థులు ఆయన్ను అడ్డుకుని స్థానికేతరుడు అయి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. దీంతో వారిని తిట్టుకుంటూ శ్రీనివాస్ అక్కడినుంచి వెళ్లిపోయారు.
-ఇల్లంతకుంట మండలం టేకుర్తిలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. డబ్బులు ఇవ్వడం లేదని సర్పంచ్, ఎంపీటీసీతో గొడవపడ్డారు. సర్పంచ్ ఇంటి ముందు నిరసన చేపట్టారు.
-జమ్మికుంటలో గజ్వేల్ ప్రాంతానికి చెందిన నలుగురు టీఆర్ఎస్ నాయకులను పట్టుకున్నారు బీజేపీ నేతలు. వారిని అక్కడి నుంచి తరిమేశారు.
-జమ్మికుంట మండలం రాచపల్లి గ్రామస్తులు సర్పంచ్ ఇంటిముందు నిరసనకు దిగారు. గ్రామంలో కొందరికి మాత్రమే డబ్బులు పంపిణీ చేశారని.. తమకు కూడా ఇస్తేనే ఓటు వేస్తామని ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు గ్రామస్తులను వెళ్లగొట్టారు.
-వీణవంక మండలం చల్లూరులో బీజేపీ నేతలు నిరసనకు దిగారు. మార్కెట్ ఛైర్మన్ బాలకిషన్ రావు ఇంట్లో డబ్బులు పంచుతున్నారని తెలియడంతో ధర్నా నిర్వహించారు.