లోక్ సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. నిరుద్యోగం సహా పలు సమస్యలపై నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆత్మహత్యలపై చర్చకు పట్టుబట్టారు.
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు టీఆర్‌ఎస్ ఎంపీలు. ఇచ్చిన హామీల అమలు తీరుపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున సభలో నినాదాలు చేశారు.
అయితే..వాయిదా తీర్మానం నోటీస్ పై చర్చకు అనుమతించకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 8 ఏళ్లుగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిందో కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు నామా నాగేశ్వరరావు.
దేశవ్యాప్తంగా గత మూడేళ్లలో సుమారు 25వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అయినా కూడా మోడీ ప్రభుత్వానికి దయ లేదని మండిపడ్డారు. మేనిఫెస్టోలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యువత ఓట్ల కోసం తప్పుడు హామీలు ఇచ్చారని విమర్శించారు.