హుజూరాబాద్ లో గెలుపు టీఆర్ఎస్ కు ఎంతో కీలకం. ఓడిపోతే మాత్రం భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం తప్పదు. దీన్ని ముందే గ్రహించిన కేసీఆర్.. ఈటలను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. అయినా ఎప్పుడు సర్వే చేసినా షాకులు తగులుతున్నాయి. అయితే కులాలవారీగా మీటింగులు పెట్టి ఓట్లు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు గులాబీ నేతలు. హరీష్ రావు సారథ్యంలో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం టీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నారు.
తాజాగా టీఆర్ఎస్ మున్నూరు కాపు సమ్మేళనం జరిగింది. దీనికి హరీష్ రావు కూడా హాజరయ్యారు. అయితే మీటింగ్ లో ఎంతసేపని కూర్చుంటాం అని అనుకున్నారో ఏమోగానీ.. గులాబీ నేతల ప్రసంగాలు కొనసాగుతుండగానే ఇంటిబాట పట్టారు ప్రజలు. హరీష్ ముందే జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఎక్కడ చూసినా కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
సభ మధ్యలోనే వెళ్లిపోతున్నారేంటని వారిని అడగ్గా… కాపుల్లో ఎక్కువగా వ్యవసాయమే చేస్తుంటారని.. ప్రభుత్వం వరి వేయొద్దని చెప్తోంది.. మరి తాము ఏం చేయాలని నిలదీశారు. ఈటల గెలుపు ఖాయమని చెప్పారు. పైగా ఈటలను ఓడించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు గుంపులుగా దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు.