జనం ఏమనుకుంటున్నారు…? వారి మూడ్ ఎలా ఉంది…? మన నిర్ణయాలపై ఎలాంటి స్పందన ఉంది…? అనే అంశాలతో కేసీఆర్ రెగ్యూలర్ గా సర్వేలు చేయించుకుంటారు. ఎన్నికలున్నా లేకపోయినా సర్వేలు రెగ్యూలర్ గా సాగుతుంటాయి. అయితే, తాజాగా కేసీఆర్ టీం సర్వేలు షురూ చేసింది. ఈసారి చేస్తున్న సర్వేలు ఎంతో కీలకమైనవి అని టీఆర్ఎస్ భవన్ వర్గాలంటున్నాయి.
కొత్తగా మొదలుపెట్టిన దళిత బంధుపై జనం ఏమనుకుంటున్నారు, రేవంత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత జనం మూడ్ ఏంటీ… కాంగ్రెస్ బలోపేతం అవుతుందా, వరుసగా పథకాలు ప్రకటిస్తున్న ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం ఎంటి, నిరుద్యోగ యవత ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉందా వంటి అంశాలతో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సర్వే చేస్తుందని తెలుస్తోంది.
అయితే, కాంగ్రెస్ నిరుద్యోగ అంశాన్ని టేకప్ చేసి అక్టోబర్ 2 నుండి డిసెంబర్ 9వరకు రాష్ట్రవ్యాప్తంగా సభలు పెట్టబోతుంది. ఇప్పటికే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలు పెట్టగా ఇప్పుడు నిరుద్యోగ సభలు పెట్టనుంది. దీంతో అవసరం అయితే అక్టోబర్ 2నే సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎంత మంది నిరుద్యోగులున్నారు, 3వేల రూపాయలు ఇస్తే ఎన్ని కోట్లు అవసరం పడతాయి అని ఆర్థికశాఖతో కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.