వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ పార్టీనే ఇదంతా చేయిస్తోందని కొందరు.. కాదు బీజేపీ ప్లాన్ అని మరికొందరు.. ఆ రెండు పార్టీలూ కాదు జగన్మోహన్ రెడ్డినే పరోక్షంగా చెల్లెమ్మతో పార్టీ పెట్టిస్తున్నారని ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. అయితే ఫైనల్‌గా షర్మిల పార్టీ వెనుక టీఆర్ఎస్ పార్టీనే ఉందన్న వాదనలకు బలం చేకూరుతోంది.
తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు షర్మిల అలా ప్రకటించగానే.. టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఇలా రెస్పాండ్ అయింది. సెటైర్లు, కామెంట్లతో షర్మిలపై విరుచుకుపడింది. ఆమెకు వ్యతిరేకంగా పోస్టులను వైరల్ చేసింది. టీఆర్ఎస్ నేతలు కూడా చాలా మంది వాటిని రీపోస్ట్ చేశారు. అయితే తరువాత ఏమైందో తెలియదుగానీ, కొద్దిసేపటికే ఆ పోస్టులన్నీ మాయమైపోయాయి. టీఆర్ఎస్ సోషల్ మీడియా అకౌంట్లలో ఉన్నవాటితో పాటు వాటిని రీపోస్ట్ చేసిన నేతలు కూడా డిలీట్ చేశారు. అందుకు ఓ ఉదాహరణే తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఫేస్‌బుక్‌లో చేసిన ఈ పోస్ట్.
‘‘అన్న అన్యాయం చేస్తే ఆంధ్రాకు వెళ్లి జగన్‌ను ప్రశ్నించాలి.. తెలంగాణలో డ్రామాలు ఆడితే డిపాజిట్లు కూడా మిగలవు..అంటూ కొణతం దిలీప్ ఫేస్‌బుక్‌లో చేసిన ఈ పోస్ట్ తొలుత వైరల్‌గా మారింది. టీవీ స్క్రీన్లపై కూడా ప్రత్యక్షమైంది. కానీ ఇప్పుడు ఆయన అకౌంట్‌లో ఈ పోస్ట్ కనిపించడం లేదు. టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలతోనే వారంతా షర్మిలపై పెట్టిన వ్యతిరేక పోస్టులను, ఫోటోలను తొలగించారని తెలుస్తోంది. మొత్తంగా షర్మిల పార్టీ వెనుక టీఆర్ఎస్ ఉందనే వాదనలకు తాజా పరిణామాలు బలాన్నిస్తున్నాయి.