టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు హాజరయ్యారు. పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం, అందుకు దారితీసిన కారణాలను సీఎం నేతలకు వివరించనున్నారు. సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానంతో పాటు సంతకాల సేకరణ చేపట్టనున్నారు.
ఈ భేటీకి తమిళనాడు వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన ఉంటుంది. అంతకుముందు ప్రగతిభవన్ నుంచి భారీ కాన్వాయ్‌తో తెలంగాణ భవన్ కు వెళ్లారు కేసీఆర్. దారి పొడవునా.. కేసీఆర్ కు ఘనస్వాగతం పలికారు టీఆర్ఎస్ శ్రేణులు.
మరోవైపు తెలంగాణ భవన్ కు కు వెళ్లే కొన్ని నిమిషాల ముందు ప్రగతి భవన్ లోని నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు కేసీఆర్. దసరా పండుగ సందర్భంగా కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు వేద పండితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా పూజలు జరిపారు.
ప్రగతి భవన్ లోనే ఆయుధ పూజలో పాల్గొన్న కేసీఆర్.. కుటుంబ సభ్యులకు, అక్కడికి చేరుకున్న ప్రజా ప్రతినిధులకు, సీఎంఓ సిబ్బందికి, సెక్యూరిటీ స్టాఫ్‌కు జమ్మి ఆకును పంచిపెట్టి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రగతి భవన్ కు బయలుదేరి వెళ్లారు.