తెలంగాణ శాసన మండలిలో అధికార టీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. మొత్తం 40 స్థానాలు ఉన్న మండలిలో అత్యధిక సీట్లను ఆ పార్టీనే కలిగి ఉంది. తాజాగా ‘వరంగల్‘తో పాటు ‘హైదరాబాద్’ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా టీఆర్ఎస్‌నే గెలుచుకోవడంతో ఆ పార్టీ బలం 36కు పెరిగింది.
మరోవైపు ‘హైదరాబాద్’లో తాజా ఓటమితో బీజేపీకి మండలిలో స్థానం గల్లంతైంది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున రాంచందర్‌రావు ఒక్కరే మండలిలో ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. ఈ నెల 29 వరకు ఆయన పదవీ కాలం ఉంది. కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత మండలి నుంచి ఆ పార్టీ అవుట్ కానుంది.
టీఆర్ఎస్ సభ్యులు 36 మంది పోగా.. మిగిలిన నలుగురిలో ఇద్దరు సభ్యులు అధికార పార్టీకి మద్దతిచ్చే మజ్లిస్ పార్టీకి చెందిన వారే. వారు కాకుండా కాంగ్రెస్ తరపున ఒకే ఒక్కడుగా జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరొకరు ఇండిపెండెంట్ సభ్యుడు ఉన్నారు.