ఓవైపు దళిత బంధు అంటారు.. ఇంకోవైపు అవమానాలకు గురి చేస్తారు.. గులాబీ రాజ్యంలో దళితులకు న్యాయం జరుగుతుందా..? మాట ఇవ్వడం.. మర్చిపోవడం అలవాటు చేసుకున్న కేసీఆర్ ను హుజూరాబాద్ దళితులు నమ్ముతారా..? దళితుడ్ని సీఎం చేస్తానంటే నమ్మారు.. మూడు ఎకరాల భూమి అనగానే ఓట్లు గుద్దారు. మరి.. ఇప్పుడు ఉప ఎన్నికవేళ కేసీఆర్ ఎత్తుకున్న దళిత బంధు రాగం సక్సెస్ అవుతుందా..? ముమ్మాటికీ కానివ్వమని అంటున్నారు బుడగ జంగాల కులస్థులు.
హుజూరాబాద్ లో గెలవాలని నానా తిప్పలు పడుతున్న టీఆర్ఎస్.. కులాల వారీగా ప్రజలను విభజించి గాలం వేస్తోంది. అందులోభాగంగా బుడగ జంగాల కులస్థులతో సమావేశం ఏర్పాటు చేసింది. కేసీఆర్ సమీప బంధువు శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. అయితే బుడగ జంగాల ఓట్లను రాబట్టేందుకు ఆధికార టీఆర్ఎస్ నేతలు చేసిన హడావుడి.. ఆ పార్టీకే తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ కార్యక్రమంలో తమ కులదైవాన్ని కించపరిచారని బుడగ జంగాలు మండిపడుతున్నారు.
తమ కుల దైవం పేరు ఉండాల్సిన చోట కేసీఆర్ పేరు రాసి పూజలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుడగ జంగాలు కులస్థులు. ఓట్ల కోసం టీఆర్ఎస్ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు ఆరోపించారు. నిజానికి వీరి ఆవేదనలో నిజముంది. మొదట్నుంచి వీరు తమ కుల పెద్ద గుస్సాయ్ దేవుడు పేరుతో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏ కార్యక్రమం నిర్వహించినా అదే తంతు. కేవలం వారి కులస్థుల సమక్షంలోనే మృతి చెందిన పూర్వీకులను పూజిస్తూ ఉంటారు.
కానీ.. చనిపోయినవారిని పూజించాల్సింది పోయి.. కుల ఆచారాన్ని కించపరుస్తూ జై కెసీఆర్, జై టీఆర్ఎస్ అని రాశారు గులాబీ నేతలు. పైగా పూజలు చేశారు. ఇది హేయమైన చర్య అంటూ బుడిగ జంగాల కులస్థులు మండిపడుతున్నారు. రూ.10 లక్షలు ఇప్పిస్తామంటూ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు, దరఖాస్తు ఫారం తీసుకొని తమను ఓట్ల కోసం ప్రలోభ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బుకు ఆశపడి కొందరు తమ ఆచారాలను కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు బుడగ జంగాల కులస్థులు.
మరోవైపు రూ.10 లక్షలు ఇప్పిస్తామని ధరఖాస్తులు తీసుకున్న టీఆర్ఎస్ నాయకులు… ప్రమాణం చేయించుకున్న తర్వాత వాటిని చెత్తకుండీలో పడేశారు. ఫోటోలతో సహా ఉన్న ఫారాలు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ పత్రాలు అన్నీ నిర్లక్ష్యంగా పడేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో తమ కుల ఆచారాలను అగౌరవ పరచడంతో పాటు తమ దరఖాస్తులను చెత్తకుండీలో వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బుడగ జంగాల కులస్థులు. టీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ గులాబీ నేతలపై మండిపడుతున్నారు.
బుడగ జంగాల ఓట్లు హుజూరాబాద్ లో కీలకమైనవి. ఈ నేపథ్యంలోనే వారికి గాలి వేయాలని ప్రయత్నించారు టీఆర్ఎస్ నేతలు. కానీ.. వాళ్ల చేతులారా వాళ్లే నాశనం చేసుకున్నారు. నిజానికి కేసీఆర్ ను నమ్మాలా..? వద్దా..? అనే మీమాంసలో ఉన్నారు దళితులు. ఎందుకంటే గతంలో సీఎంను చేస్తానని మోసం చేశాడు. మూడు ఎకరాల భూమి ఇస్తానని మాయ చేశాడు. కేబినెట్ లో సరైన చోటు ఇవ్వకుండా నాటకాలాడుతున్నాడు. ఇవన్నీ చూసిన దళితులు ఇప్పుడు దళిత బంధు అనగానే నమ్ముదామా..? వద్దా..? అనే ఆలోచనలో ఉన్నారు. తాజాగా బుడగ జంగాలకు జరిగిన అవమానాన్ని చూశాక… కేసీఆర్ ముమ్మాటికీ దళిత వ్యతిరేకే అని మాట్లాడుతున్నారు దళిత సంఘాల నాయకులు.