విషయం వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్ లో ఉంటుంది కదా.. గులాబీలను చూస్తుంటే ఇదే గుర్తుకొస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. దానికి కేటీఆర్ నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా ఇది అఖండ విజయం.. క్లీన్ స్వీప్.. మమ్మల్ని కొట్టేవాడు ఎవరు? ఎదురు నిలబడే వాడు ఎవరు? అంటూ డబ్బా కొట్టుకున్నారు. నిజంగా ఇది అఖండ విజయమేనా? పార్టీలోని నాయకులకు, ప్రజలకు టీఆర్ఎస్ పై నిజంగా నమ్మకం ఉందా? రాష్ట్రంలో జరుగుతున్నవాటికి.. గులాబీ లీడర్లు చెప్పే దానికి పొంతన ఉందా?
ఫలితాల ప్రక్రియ అయిపోగానే 12కి 12 మావే… క్లీన్ స్వీప్.. ఈ విజయంతో రాష్ట్రంలో ఎదురులేని పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందంటూ ప్రకటించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన తీరు చూస్తుంటే ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు గెలిచామా లేదా? అనే డైలాగ్ గుర్తుకు రాకుండా ఉండదు. ఎందుకంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జరిగిన రాజకీయం అలాంటిది మరి. ఓవైపు వ్యవస్థ అంతా చేజారిపోతోంది.. సొంత పార్టీ నేతలే మాట వినడం లేదు. తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. హుజూరాబాద్ లో పరాభవం మూటగట్టుకున్నాం.. ఇలాంటి టైమ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడిపోతే జెండా పీకేయడమేనని ముందే గ్రహించిన గులాబీ బాస్ క్యాంపు రాజకీయం నడిపారు. దొరికిందే ఛాన్స్ అనుకుని స్థానిక నేతలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అందినకాడికి లాగారు. మరి.. ఇదేనా క్లీన్ స్వీప్ అంటే.. కేటీఆర్ సార్.. అంటూ ప్రతిపక్షాలు చురకలంటిస్తున్నాయి.
క్యాంపు రాజకీయల సంగతి అటుంచితే.. సొంత పార్టీ నేతల ఓట్లనే సరిగ్గా రాబట్టలేకపోయింది టీఆర్ఎస్. మామూలుగానే అసంతృప్తిలో ఉన్న వారిని ఏదో ప్రస్తుతానికి అమ్యామ్యాలతో సరిపెట్టి ఓట్లు దండుకోవాలని చూసింది. కానీ.. విపరీతంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు ఉన్న ఓటర్ల కంటే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. క్యాంపులు పెట్టారు.. కావాల్సినవన్నీ ఇచ్చారు. అయినా కూడా క్రాస్ ఓటింగ్ జరిగిందంటే అర్థం ఏంటి? మీపై.. మీ పాలనపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఉన్నట్లు కాదా? ఇలాంటి వాటిని బయటకు రానివ్వకుండా క్లీన్ స్వీప్.. అఖండ విజయం అంటూ చెప్పుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నాయి ప్రతిపక్షాలు.
దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ దెబ్బకు టీఆర్ఎస్ వర్గాల్లో కలవరం పెరిగింది. వచ్చే ఎన్నికల టైమ్ కి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే బీజేపీకి చాలామంది నేతలు టచ్ లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. నిజమైన ఉద్యమకారులను ఈటల రాజేందర్ ఓచోటకు చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికితోడు రైతుల విషయంలో కేంద్రాన్ని బద్నాం చేద్దామనుకుని పరువు పోగొట్టుకుంది టీఆర్ఎస్. సైలెంట్ గా సంతకాలు పెట్టేసి.. బలవంతంగా చేయించారంటూ స్టేట్ మెంట్లు ఇస్తే జనాలు నమ్ముతారా? ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అసహనంలో ఉన్నారు. ప్రభుత్వం పేరెత్తితే తిట్ల దండకం అందుకుంటున్నారు. పైగా కొనుగోళ్ల జాప్యం వల్ల అన్నదాతలు వరి కుప్పలపైనే కుప్పకూలుతుంటే.. రోమ్ తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. రైతుల చావులు పట్టకుండా కేసీఆర్ తీర్థయాత్రలకు వెళ్లడం వారి కోపాగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
ఇటు నిరుద్యోగులు కూడా కేసీఆర్ పై రగిలిపోతున్నారు. ఎన్నికలొస్తే చాలు 50వేలు అంటూ మాయ చేయడం తప్ప.. నోటిఫికేషన్ల జాడే ఉండడం లేదు. ఇస్తానన్న భృతి ఇవ్వడం లేదు. విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాల వారిని కేసీఆర్ మోసం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే బలంగా నమ్ముతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో గడ్డుకాలం తప్పదని భావిస్తున్నారు. వారిలో పెరిగిన అసమ్మతికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగే నిదర్శనం. ఎన్ని తాయిలాలు అందించినా కూడా అధిష్టానానికి షాకిచ్చారంటే.. వారిలో ఎంతగా వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు విశ్లేషకులు. పైగా రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేయడానికి మళ్లీ కేంద్రంపై యుద్ధం అంటూ స్టాలిన్ ను కలవడం.. ఫ్రంట్ పేరుతో రాజకీయం మొదలు పెట్టడం చూసి జనం నవ్వుకుంటున్నారని చెబుతున్నారు.