గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచారం ఇంకా సెంటిమెంట్ చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రం వచ్చి, అలాగ తాము అధికారంలోకి వచ్చి ఆరేళ్లు దాటినా… ఆ పార్టీ నేతలు ఇంకా పాత మాటలే వల్లె వేస్తున్నారు. పైగా ప్రత్యర్థి మారినా డైలాగులు మాత్రం పొల్లుపోకుండా అప్పజెప్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ టార్గెట్ చేస్తూ.. ఢిల్లీ గులాములు కావాలా.. గల్లీ నాయకత్వం కావాలా అంటూ సెంటిమెంట్ పండించారు. ఇక ఇప్పుడు బీజేపీని తమ ప్రత్యర్థిగా భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు మళ్లీ అలాంటి పాటే పాడుతున్నారు.
గ్రేటర్ ఎన్నికల ఇంచార్జీగా ఉన్న కేటీఆర్… గుజరాత్ గులాములు కావాలా.. హైదరాబాద్ గులాబీలు కావాలా అంటూ పదే పదే ఒక ప్రశ్నను ఓటర్లకు విసురుతున్నారు. ఓ వైపు కేసీఆర్ ఏమో స్థానిక సంస్థలపై కేంద్రం అధికారాలు తక్కువ అని.. అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్తుంటారు.. మరోవైపు కేటీఆర్ ఏమో గ్రేటర్ ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలిస్తే గుజరాత్ వెళ్లాలి, ఢిల్లీ వెళ్లాలి అన్నట్టుగా డైలాగులు విసురుతారు.
అయినా ఆరేళ్లలో ఏం చేశామో చెప్పుకోవాల్సింది పోయి… మరో పార్టీ అధికారంలోకి వస్తే జరగరానిదేదో జరుగుతుందన్నట్టు టీఆర్ఎస్ నేతలు నగరవాసులని మరీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ పార్టీ అయినా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. ప్రజలు మార్పు కోరుకుంటేనే గతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.. మంచిగా ఉంటే జనం ఆ పార్టీకే మళ్లీ పట్టం కడతారు.. లేదా మరోపార్టీని కుర్చీ ఎక్కిస్తారు. అంతే. ఇట్స్ క్లియర్!