ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ నాయకుల పోటా పోటీ పర్యటనలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీనితో అటు రాజకీయ వర్గాలలో ఇటు సొంత క్యాడర్ లో చర్చ జరుగుతుంది. నాయకుల జోరు పర్యటనల ఆంతర్యం ఏమై ఉంటుంది…? ఎందుకు పోటాపోటీగా జిల్లాలో పర్యటిస్తున్నారు అని క్యాడర్ ఆలోచనలో పడింది.
చర్చ అలా ఉంచితే నాయకుల పర్యటనతో క్యాడర్ మాత్రం ఇబ్బంది పడుతున్నారు. నియోజకవర్గానికి ఏ నాయకుడు వచ్చినా వారితో పాటు వెళ్ళాలి వెళ్లకపోతే నాయకులకు కోపం వస్తుంది. వెళ్దామంటే ఒకరికి ఇద్దరు ముగ్గురు నాయకులు వస్తున్నారు. వారితోపాటు వెళితే సొంత పనులు చేసుకోలేకపోతున్నం, డబ్బులు ఖర్చు అవుతున్నాయి, ఏమి చేయాలో అర్థం కావడంలేదు అంటూ సొంత పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి తుమ్మల ఒకవైపు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒకవైపు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జిల్లా ఎం ఎల్ సీ లు చైర్మెన్ లు ఇలా అందరు తలా ఒకదారిలో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పెళ్ళిళ్ళ పేరుతో చావుల పేరుతో బర్త్ డే ఫంక్షన్స్ పేరుతో ఇలా ఎదో ఒక ఫంక్షన్ పేరుతో తరచూ వచ్చిపోతున్నారు. ఆయా నాయకుల ఆఫీస్ నుండి ఫోన్లు వస్తాయి. సార్ వస్తున్నాడు మీదగ్గరకు వస్తున్నాడు… మీరు అందుబాటులో ఉండండి అంటారు.
వెళ్లకపోతే కుదరదు ఎవరు వచ్చినా వెళ్ళాలి, వెళితే మాకు తడిసి మోపిడి అవుతుంది. జేబులు ఖాళీ అవుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నాలుగు సంవత్సరాలు దాక ఎన్నికలు లేవు. ఇప్పటినుండి నాయకులు పోటాపోటీగా తిరిగితే ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలా భరించాలి, ఈ నాలుగు సంవ్సరాలు ఖర్చులు ఎలా చేయాలి, అప్పటిదాకా మా పరిస్టితి ఏమిటి అని తమ గోడు కనపడిన వారికందరికి వెళ్లబోసుకుంటున్నారు.
మొత్తానికి నాయకుల పోటాపోటీ పర్యటనలు కింద క్యాడర్ చావుకి వచ్చింది. ఎంకి పెళ్ళి సుబ్బు చావుకి వచ్చింది అన్నట్లు ఉంది గ్రామ, మండల నాయకుల పరిస్థితి.