సెప్టెంబర్ 17న గజ్వేల్ లో కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే సభ ఏర్పాట్లు, జన సమీకరణపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. స్వయంగా సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం కావటంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ టీం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అండ్ టీం పనిచేస్తున్నారు.
అయితే, రేవంత్ రెడ్డికి పెరుగుతున్న క్రేజ్ దృష్ట్యా… సభను ఎలాగైనా ఫెయిల్ చేసేందుకు టీఆర్ఎస్ ఎత్తులు వేస్తుంది. గజ్వేల్ లో ప్రతి గ్రామం నుండి మీటింగ్ వచ్చేలా కాంగ్రెస్ ఏర్పాట్లు చేయగా, అక్కడ ఉన్న సర్పంచ్ లతో టీఆర్ఎస్ నాయకులు మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. గ్రామాల నుండి ఒక్క వెహికల్ కూడా వెళ్లనీయకుండా సర్పంచ్ లకు బాధ్యతలిస్తున్నారు. ప్రతిఫలంగా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సర్పంచ్ ల బిల్లులన్ని క్లియర్ చేస్తున్నారు. అంతేకాదు ముంపు గ్రామాల సర్పంచ్ లతో ఇటు నేతలతో పాటు అటు పోలీసు అధికారులు కూడా సమావేశమై జనం రాకుండా చూడాలని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్ గ్రామ కమిటీలు ఏర్పాటు చేసింది. దీంతో కొత్త గ్రామ అధ్యక్షుల ఆద్వర్యంలో సెప్టెంబర్ 17నే ప్రతి గ్రామంలో కనీసం 500మందికి భోజనాలు ఏర్పాటు చేయాలని పార్టీ పెద్దల నుండి ఆదేశాలు వెళ్లాయి. అందుకు అవసరం అయిన మొత్తం ఖర్చులు పార్టీయే భరిస్తుంది. సిద్దిపేటను కూడా విడిచి పూర్తిగా హుజురాబాద్ పైనే ఫోకస్ చేసిన మంత్రి హరీష్ రావు సైతం అదే రోజు గజ్వేల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో మెరుపు పర్యటనలు, అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు షెడ్యూల్ ఇచ్చారు.
గజ్వేల్ లోని ప్రతి ఎస్.ఐకి టార్గెట్స్ ఇచ్చి మరీ జనం రాకుండా చేయాలని… జన సమీకరణ ఎవరు చేస్తున్నారో చూసి వారిపై పాత కేసులను తోడటం, లేదంటే తమ మాట వినకపోతే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. చాలా మంది సర్పంచ్ లు పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారన్న సమాచారం అందటంతో వారిని బెదిరించినట్లు తెలుస్తోంది. గజ్వేల్ సభను జనం లేకుండా చేసి… అట్టర్ ప్లాఫ్ గా ముద్ర వేయాలని, రాజ్యసభ ప్రతిపక్ష నేత ముందు రేవంత్ రెడ్డిది ప్లాప్ షో గా చూపించాలన్న పట్టుదలతో టీఆర్ఎస్ ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఓవైపు కేసులు, మరో వైపు నోట్ల కట్టలతో తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నారని కార్యకర్తలంటున్నారు. అదే రోజు కొందరు మండల స్థాయి నేతలను టీఆర్ఎస్ వైపుకు తిప్పుకునేందుకు కూడా బేరసారాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.
ఇలా… కాంగ్రెస్ దళిత గిరిజన సభకు జనాన్ని వెళ్లనీయకుండా టీఆర్ఎస్ ఎత్తులు వేస్తూనే ఉంది.