– ప్లీనరీలో కేసీఆర్ ఏం మాట్లాడనున్నారు..?
– జాతీయ రాజకీయాలపై ప్రకటన చేయనున్నారా..?
– అందులో పీకే పాత్ర ఏంది..?
– కేసీఆర్ అడుగులు ఎటు పడుతున్నాయి..?
– ప్రకటన చేసేందుకే ప్లీనరీ నిర్వహిస్తున్నారా..?
– ప్లీనరీలో సర్వత్రా ఆసక్తి
కాంగ్రెస్ కు ఝలక్ ఇచ్చిన రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిశోర్ మనసులో ఏముంది. హస్తం పార్టీకి హాండ్ ఇచ్చాడు సరే.. మరి గులాబీతో స్నేహం సంగతేంటి..? టీఆర్ఎస్ ప్లీనరీలో తన జాతియ రాజకీయాల ఎంట్రీపై కేసీఆర్ చేయబోయే ప్రకటన వెనక పీకే మాస్టర్ మైండ్ ఉందా..? పీకే సారధిగా గులాబీ బాస్ దేశ్ కీ నేతా కానున్నారా..?
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ 21 ఏళ్లు పూర్తి చేసుకొని.. 22వ యేట అడుగు పెట్టబోతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో ప్రతినిధుల సభ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. నేటి ప్లీనరీ వేదికగా పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ రాజకీయ, ప్రభుత్వపరమైన అంశాలపై కీలక దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. దేశరాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాల గురించి చర్చించడంతో పాటు.. జాతీయ పార్టీ లేదా జాతీయ ఫ్రంట్ పైన ఓ ప్రకటన చేయనున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
జాతియ రాజకీయాలపై ప్రకటన చేయడానికి వీలుగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం కాంగ్రెస్ తో తెగదెంపులు చేసుకున్నారని బహిరంగగానే చర్చలు జరుగుతున్నాయి. జాతీయ పార్టీకి సంబంధించి పీకేకు పూర్తి బాధ్యతలు అప్పగించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కావాల్సినంత స్వేచ్ఛ, అవసరమైన బ్యాకప్ అందిస్తూ ఆయన ద్వారా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ భారీ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే టీఆర్ఎస్ ప్లీనరీకి జాతీయ మీడియా ప్రతినిధులను పెద్ద సంఖ్యలో పిలిచారని అంటున్నారు.
దేశాన్ని సరైన దారిలో నడిపించడంలో కాంగ్రెస్, బీజేపీ విఫలం అయ్యాయని.. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక వస్తే తప్ప భారతీయుల బతుకులు బాగుపడవని సీఎం కేసీఆర్ చాలా సార్లు చెప్పారు. అందులో భాగంగానే బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కొంత కాలంగా కృషి చేస్తున్నారు. కానీ.. ఆయన చేసిన ప్రయత్నాలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో పీకేను జతచేసుకున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి.
నేటి ప్లీనరీలో కేసీఆర్ చేయబోయే ప్రసంగం, పార్టీ చేయబోయే తీర్మానాల ద్వారా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పాత్రపై మరింత స్పష్టత ఇవ్వనున్నారని అంటున్నారు విశ్లేషకులు. బీజేపీ మతతత్వాన్ని క్యాన్సర్ తో పోల్చిన కేసీఆర్.. ఆ రోగాన్ని తెలంగాణకు అంటనీయొద్దని వాదిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నెలకొన్న మతఘర్షణ వైఖరిని హైలైట్ చేయడంతో పాటు.. కాంగ్రెస్ నాయకత్వలేమిని ప్రశ్నిస్తూ జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ వేదికను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
టీఆర్ఎస్ జాతియ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్ రంగ ప్రవేశం.. కేంద్రంతో యుద్దం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శల హోరు.. తదితర అంశాల నేపథ్యంలో పార్టీ బలాబలాపై విస్తృతస్థాయి సర్వేలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది టీఆర్ఎస్ ప్లీనరీ ఎలా జరగబోతోంది.. అందులో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు.. అనే విషయాలపై పార్టీ శ్రేణులతో పాటు దేశ రాజకీయాల్లోనూ ఆసక్తి నెలకొందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. ప్లీనరీని కవర్ చేసేందుకు జాతీయ మీడియా నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులను కేసీఆర్ ఆహ్వానించారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న నేపథ్యంలోనే ఈసారి ప్లీనరీకి పార్టీ వ్యూహకర్తలు జాతీయ మీడియాను ఆహ్వానించారు.