– నిబంధనలు ప్రజలకేనా?
– గులాబీ నేతలు పాటించరా?
– ప్లీనరీ పేరుతో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు
– 1000కి పైగా ఫిర్యాదులు
– నామమాత్రపు జరిమానాలతో సరి!
– ఇతర ఫ్లెక్సీలు క్షణాల్లో తొలగించే అధికారులు..
– గులాబీలవి ఎందుకు తొలగించరు?
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దనే నిబంధనలు ఉన్నా టీఆర్‌ఎస్ నేతలు ఎందుకు పాటించరు? కార్యక్రమం అయ్యేవరకు ఫ్లెక్సీలు ఉంచి అధికారులు తీరిగ్గా జరిమానాలు ఎందుకు వేస్తున్నారు? ప్రతిపక్షాల ఫ్లెక్సీలు క్షణాల్లో తొలగించే అధికారులు.. అధికార పార్టీకి చెందిన కటౌట్ల జోలికి ఎందుకు వెళ్లరు? ఇలా అనేక ప్రశ్నలు టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా వినిపించాయి. ఎప్పటిలాగే ఫ్లెక్సీలు, బ్యానర్లకు జీహెచ్ఎంసీ సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం అధికారులు నామమాత్రపు ఫైన్లు వేసి తూతూ మంత్రంగా ముగించేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్లీనరీ సందర్భంగా రాత్రికి రాత్రే నగరంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు వెలిశాయి. వాటిపై రెండు రోజుల్లో ప్రజల నుంచి జీహెచ్ఎంసీకి ట్విట్టర్ లో వెయ్యికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. జనం నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కార్యక్రమం ముగిసేవరకు సైలెంట్ గా ఉన్న అధికారులు.. తర్వాత తీరిగ్గా ఫైన్లు వేశారు. అదికూడా జనం ప్రశ్నిస్తేనే.. లేకపోతే అంతే సంగతలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేతలు ప్లెక్సీలు పెడితే గంటకే స్పందించే జీహెచ్ఎంసీ అధికారుల కంటికి రెండు రోజులుగా వేలాడుతున్న గులాబీ తోరణాలు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని ప్రశ్నిస్తున్నారు జనాలు. పాలకుల చేతిలో కీలు బొమ్మల్లా అధికారులు పనిచేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. అటు ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. నేరుగా వేసిన ఫైన్ లు పదుల సంఖ్యలో కూడా లేకపోవడం గమనార్హం. అత్యధికంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రూ.2 లక్షల ఫైన్ వేశారు.
Advertisements
టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు రూ. లక్ష, మరో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు రూ.50 వేల ఫైన్లు వేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. మొత్తంగా రూ.10 లక్షల వరకు జరిమానాలు విధించినట్టు చెబుతున్నారు. సామాన్య ప్రజలు టూ–లెట్ బోర్డులు పెడితే క్షణాల్లో స్పందించి ఫైన్లు వేసే జీహెచ్‌ఎంసీ అధికారుల కండ్లకు టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలు రోజుల తరబడి కనిపించినా తర్వాత తీరిగ్గా ఫైన్లు వేయడం వారి అసమర్ధతను గుర్తు చేస్తోందని అంటున్నారు ప్రజలు.