తల తోకను ఆడిస్తున్నదా? తోక తలను ఆడిస్తుందా? అని కొన్ని సందర్భాల్లో పెద్దలు అంటుంటారు. మొన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కూడా ఈ సామెతను వాడబోయి కుక్క తోకను ఆడిస్తుందా.. తోక కుక్కను ఆడిస్తుందా అని అన్నారు. తల తోకను ఆడించాలి కానీ, తోక తలను ఆడించలేదు అని చెప్పడం కేసీఆర్ ఉద్దేశం కావొచ్చు. ఇప్పుడు టీఆరెస్‌లో తోకలు తలను ఆడిస్తున్నాయ్ అంటున్నారు గులాబీ తమ్ముళ్లు.
ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో కేసీఆర్ కుక్క-తోక ప్రస్థావన తెచ్చారు. తోకలు కుక్కలను ఆడించలేవు అని ఉద్యోగులకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చెప్పడం మంచిదే. ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేయాలని సీఎం ఉద్దేశం అని అంటున్నారు గులాబీ శ్రేణులు. కానీ మా పార్టీలో తోకలు తలను ఆడిస్తున్నాయ్ అని టీఆర్ఎస్ శ్రేణులు కొత్త ఈక్వేషన్ ఒకటి చెబుతున్నాయ్. సీఎం కోటరీలో ఉన్న ఎస్ఆర్‌పీ బ్యాచ్ మంత్రులను, సీనియర్ నాయకులను ఓవర్‌టేక్ చేయడమే కాకుండా మేము చెప్పిందే నడవాలన్న ధోరణిలో వారి వ్యవహర శైలి ఉందంటున్నారు. వీరు జిల్లాలలో కూడా జోక్యం చేసుకుంటున్నారని, లేనిపోని తలనొప్పులు తెస్తున్నారని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ దగ్గర తమ వాళ్లను ప్రమోట్ చేసుకోవడం. వారికి గిట్టని వారి పట్ల చాడీలు చెప్పడం చేస్తున్నారని, ఇవి పార్టీకి నష్టం తెచ్చే చర్యలని, పార్టీలో గ్రూపిజానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌కి అన్ని విషయాలూ తెలుసునని, అయినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. కొన్ని సందర్భాలలో కేటీఆర్ బహిరంగంగానే వారి మీద సెటైర్లు వేస్తారని, కేసీఆర్‌కి లేనిపోనివి చెపుతారు అన్న కోపం లేకపోలేదు కానీ ఆ తరువాత మళ్ళీ పట్టించుకోకపోవడంతో ఈ ఎస్ ఆర్ ఎస్ పి బ్యాచ్ చెలరేగుతోందని అనుకుంటున్నారు. సంతోష్ కరెక్ట్‌గా ఉంటే సీఎం దగ్గర వీరి ఆటలు సాగవని, ఆయన మద్దతు వుండటం వలనే వీరు విర్రవీగుతున్నారని చెప్పుకుంటున్నారు. ప్రగతి భవన్‌కి వెళ్లాలంటే అందరికి సాధ్యం కాదు. పార్టీ పెట్టిన నాటి నుంచి ఉన్న వాళ్ళు, కేసీఆర్‌కి సన్నిహితంగా ఉన్నవాళ్లు సైతం వెళ్లాలన్నా కూడా కష్టమే. సీనియర్ నాయకులు కూడా వెళ్లలేని పరిస్థితి. మంత్రులు సైతం ముందుగా అనుమతి తీసుకుంటారు. కానీ ఎస్ఆర్‌ఎస్‌పీ బ్యాచ్ వాళ్లు తలచుకుంటే ఎవరంటే వారు ప్రగతి భవన్‌కి వెళ్లొచ్చు అంటున్నారు. పల్లా, శ్రవణ్ రెడ్డి పెంచి పోషిస్తున్న తాతా మధు ఎప్పుడూ ప్రగతి భవన్‌లోనే ఉంటాడని, ఇటీవల సీఎం అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ప్రతిరోజూ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో అసెంబ్లీకి వచ్చాడంటే అర్ధం చేసుకోవచ్చునని అంటున్నారు. తాతా మధు తెలంగాణ వచ్చాక రాష్ట్రానికి వచ్చిన వ్యక్తి. ఇప్పటికీ ఆయన కుటుంబం అమెరికాలోనే ఉంది. అప్పుడప్పుడు అమెరికాకు వెళ్లి వస్తుంటాడని చెప్పుకుంటున్నారు. అమెరికాలో వున్నప్పుడు ఈయన గారు తెలంగాణకు వ్యతిరేకి అని, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పనిచేసే టీడీఎఫ్‌కు వ్యతిరేకంగా టీడీపీ వారితో కలసి పనిచేశాడని, ఈ విషయం అందరికీ తెలుసునని, అయినా ఎందుకు ఇలాంటి వారిని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధం కావడం లేదని పార్టీలో మొదటి నుంచి పనిచేసిన సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాలాంటి వాళ్ళం ప్రగతి భవన్‌కు వెళ్లాలంటే సాధ్యం కావడం లేదు అని తమ గోడు వెళ్ల బోసుకుంటున్నారు. మధు బాబు ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్నాడని అనుకుంటున్నారు. జిల్లా పార్టీ అంతా సీఎం గారు నన్నే చూడమన్నారు అని చెప్పుకుంటూ జిల్లా పార్టీ ఆఫీస్‌లో అందరి మీదా పెత్తనం చేస్తున్నాడని అంటున్నారు. అందులో బాగంగా ఒకసారి టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ బొమ్మెర్ రామూర్తిని కూడా పార్టీ కార్యాలయంలోకి రాకుండా ప్రయత్నం చేశాడని కూడా చెబుతారు. సీఎం కోటరీలో వున్నవాళ్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి.. పార్టీకి లాభం చేసే పనులు చేయాలి తప్ప నష్టం తెచ్చే పనులు చేయకూడదు. కానీ వీరు సొంత ఎజెండాలతో సీఎం దగ్గర పనిచేస్తున్నారని, పార్టీకి నష్టం తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిని కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం తప్పదని చెపుతున్నారు. ఇవేవీ రహస్యంగా జరిగే కార్యక్రమాలు కావని, అందరికీ తెలిసిన విషయాలే అని బహిరంగంగా అందరు మాట్లాడుకునే విషయాలే అని కూడా చెపుతున్నారు. ఇప్పటికైనా కేటీఆర్ జోక్యం చేసుకొని ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలని, ఆ విషయాలు అధినేత దృష్టిలో పెట్టాలని అంటున్నారు. లేదంటే రానున్న రోజులలో గ్రూపులు పెరిగి నష్టపోవడం ఖాయం అంటున్నారు.