తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై విషం చిమ్మారంటూ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు అటు ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో నిరసనలు కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో మంత్రులు సైతం రోడ్లపైకి వచ్చి మోడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర టీఆర్ఎస్ ఎంపీల నిరసన చేపట్టారు. మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే చాలా బిల్లులను చర్చించకుండానే ఆమోదిస్తోందని విమర్శించారు ఎంపీలు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కవిత, రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు తెలంగాణ ఏర్పాటుపై మోడీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్లమెంట్ సాక్షిగా ఏర్పాటైన రాష్ట్రంపై మోడీ వ్యాఖ్యలు సరికావన్నారు.
హైదరాబాద్ అజంపురా చౌరస్తాలో హోంమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుగా హోంమంత్రి నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి చాదర్ ఘాట్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ పీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని వ్యాఖ్యలు యావత్ తెలంగాణ సమాజాన్ని కించ పరిచేలా ఉన్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ లో మోడీ మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉందన్నారు. విభజన హామీలను ప్రధాని నెరవేర్చాల్సింది పోయి, తెలంగాణ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా..? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోడీ గారు? అంటూ ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. ప్రాణాలకు తెగించి కేసీఆర్ చేసిన పోరాటం, వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా..
ఇదెక్కడి న్యాయం మోడీజీ అని మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుండి తెలంగాణ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ ని నిర్వహించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పార్లమెంట్ లో అడ్డగోలుగా మాట్లాడిన మోడీ తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జోగు రామన్న.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నల్ల కండువాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో బాల్క సుమన్, దివాకర్ రావు సహా పలువురు పాల్గొన్నారు.
ఇక మోడీ వ్యాఖ్యలను నిరసిస్తూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో బైక్ ర్యాలీ నిర్వహించారు మంత్రి తలసాని శ్రీనివాస్. తర్వాత బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఖమ్మంలో నల్లజెండాలతో బైక్ ర్యాలీ తీశారు మంత్రి పువ్వాడ అజయ్. టీఆర్ఎస్ శ్రేణులు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నారు. శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆర్మూర్ పట్టణంలో మోడీ వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ తోపాటు శవయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. జీవన్ రెడ్డి సహా టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
మోడీది తెలంగాణ అభివృద్ది పట్ల ఈర్ష, ద్వేషం, అసూయ అంటూ మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరుగున పరిచి, ఏకవ్యక్తి పరిపాలనతో చలామణి అవుతున్న మోడీ మోనార్క్ లా దేశాన్ని ఏలాలని భావిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. మోడీ రాచరికపు ఆలోచనా విధానానికి గండికొట్టే సాహసం చేస్తోంది ఒక్క కేసీఆర్ మాత్రమేనని చెప్పారు.
తెలంగాణపై కేంద్ర సర్కార్ అనుసరిస్తున్న తీరు, పదే పదే పార్లమెంట్ లో ప్రధాని తెలంగాణ బిల్లును అవమానిస్తూ చేస్తున్న వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు మంత్రి గంగుల కమలాకర్. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలను ఖండిస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు వ్యాపార వాణిజ్య రంగాలు స్వచ్చందంగా నల్ల బ్యాడ్జీలతో, జెండాలతో నిరసన తెలిపారు.