పెట్రోల్, వంటగ్యాస్ ధరల పెంపుపై కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో టీఆర్‌ఎస్ వర్గాలు నిరసన కార్యక్రమాలకు దిగాయి. సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించగా.. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దేశ ప్రజల కోసం ప్రధాని మోడీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్టలేదని విమర్శించారు తలసాని శ్రీనివాస్. అదే.. టీఆర్‌ఎస్ చేసిన మంచి పనులు 150కిపైగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న మోడీని, బీజేపీని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. దేశం నుంచి తరిమికొట్టేవరకు బీజేపీకి బుద్ధి రాదన్నారు.
పెంచిన గ్యాస్ ధరను రూ.400 తగ్గించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మిగిలిన రూ.600 కేంద్రమే భరించాలన్నారు. బండి సంజయ్ కు ధైర్యం ఉంటే ఢిల్లీలో కొట్లాడాలని.. వంట గ్యాస్ ధరను తగ్గించేలా చేయాలని సవాల్ చేశారు. ఓవైపు క్రూడాయిల్ ధరలు తగ్గుతుంటే ఇంకోవైపు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ కేంద్రంలోకి వచ్చినప్పటి నుంచి సబ్సిడీల కింద కూడగట్టుకున్న రూ.23 లక్షల కోట్లు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు కవిత. ప్రజల నుంచి గుంజుకుని బడాబాబులకు ఇస్తున్నారని ఆరోపించారు.
హన్మకొండ జిల్లా పరకాలలో ధర్మారెడ్డి, కడియం శ్రీహరి నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై కూర్చొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెరిగిన వంటగ్యాస్, పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలను డబుల్ చేసి ప్రజలపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.