రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా హెటిరో గ్రూప్స్ ఛైర్మన్ పార్థసారథి రెడ్డి, నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు నామినేషన్ దాఖలు చేశారు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డీ శ్రీనివాస్ ల పదవీకాలం వచ్చే నెల 21తో ముగుస్తోంది వారి స్థానాల్లో వీరిద్దర్ని ఎంపిక చేశారు కేసీఆర్.
ఈ నెల 31 వరకు ఈ స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన, మూడోతేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. జూన్ 10న పోలింగ్ జరగనుంది. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా దామోదర్ రావు, పార్ధసారథికి పలువురు నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన క్రమంలో ఖాళీ అయిన స్థానానికి ఇటీవల ఉపఎన్నిక జరిగింది. దీనికి టీఆర్ఎస్ తరఫున అభ్యర్థిగా గాయత్రి రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.