ఈటెల రాజేందర్ ఇప్పుడు మంత్రి. అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి మురికివాడకు వెళ్లి తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను ప్రజలకు తెలియజేసిన వ్యక్తి. తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఉద్యమంలో ఒక విశిష్టత కలిగిన వ్యక్తి. ఉద్యమంలో ఈయన చేసిన క్షేత్రస్థాయి పని అప్పుడు సమైక్య వాదులుగా ఉండి ఇప్పుడు తెలంగాణలో అధికారం అనుభవిస్తున్న కొందరికి తెలియదేమో కానీ, ఈయన గురించి, ఇతని వ్యక్తిత్వం గురించి తెలిసిన ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి తెలుసు. మరిప్పుడు ఎందుకు ఈటెల వ్యక్తిత్వానికి, ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఆయన కోటకు బీటలు వారుతున్నాయి!? దానికి కారణం లేకపోలేదు.
మాములుగా రాజకీయాల్లో ఒక మృదు స్వభావిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తికి కోపం కట్టలు తెచ్చుకుంది. టీఆర్ఎస్ అధిష్టానంపై ఫైర్ అయ్యడు. ‘గులాబీ జెండాకి ఓనర్లకు మేమే’ అంటూ ఎర్ర జెండా ఎగరవేశాడు. 2018 డిసెంబర్ శాసనసభ ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌పై ఒక అనామక వ్యక్తి, ఇంకా చెప్పాలంటే నియోజకవర్గం నలుమూలలకు కూడా తెలియని వ్యక్తి పోటీ చేసినప్పుడు ఆ యువకునికి 66 వేల పైచిలుకు ఓట్లు వచ్చి ఈటెలపై తనకున్న బలాన్ని చెప్పకనే చెప్పాడు.
అది ఆ అనామక వ్యక్తి బలం అనుకుంటే పొరపాటే అవుతుంది. అది టీఆర్ఎస్ చుట్టూ ఉన్న అంతర్గత వ్యతిరేక గ్రూపుల బలం. ఆ గ్రూపుల బలమే ఈటెల రాజేందర్‌కి మెజారిటీ తగ్గేలా చేసింది. అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదని అనలిస్టులు అంటుంటారు. దాని వెనక టీఆర్ఎస్ అధిష్టానం ఉందన్నది కొందరికే తెలిసిన సత్యం. అన్నీ తెలిసీ అప్పటి నుంచి మౌనంగానే ఉన్న ఈటెల మొన్నీ మధ్య లోకసభ ఎన్నికల్లో అప్పుటి నగ్నసత్యాన్ని చెప్పి హెచ్చరించాడు. కానీ ఆ గ్రూపులు మారలేదు. దాంతో ఆయనలో ఉన్న ఫైర్ మొత్తం ఒక్కసారి బయటకి వచ్చింది. ఇప్పుడు ఈటెల తన సమయం కోసం ఎదురు చూస్తున్నాడనే చెప్పాలి.
వాస్తవానికి ఈటెల రాజేందర్‌కి నియోజకవర్గంలో కానీ, రాష్ట్రవ్యాప్తంగా కానీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈటెలకి వ్యతిరేకంగా ఒక గ్రూప్‌ని తయారుచేసి అతని ప్రాబల్యాన్ని తగ్గించాలనే అధిష్టానం వ్యూహం బెడిసి కొట్టింది. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ఏం చేసేది లేక అధిష్టానం మంత్రిమండలిలో కొనసాగించి బుజ్జగించిందని కొన్ని టీఆర్ఎస్ పార్టీ ఆంతరంగిక వర్గాలు చెప్తాయి.