ఎన్నో సంవత్సరాలుగా పదవికోసం ఆశపడి నిరాశలో ఉన్న ఆ నేతకి ఇప్పుడు అదృష్టం పదవి రూపంలో వరించింది. అయినా ఒకప్పుడు ప్రజానేతగా పేరున్న అయన ఇప్పుడు సొంత నియోజకవర్గ ప్రజలకే చేరువకాలేక పోతున్నాడు. కాలం కలిసొచ్చినా… నియోజకవర్గ అభివృద్ధి మాత్రం కానరావడం లేదని ఒకింత ఆవేదనతో ఉన్నారు. తనకు ఓటువేసిన ఓటర్లకు… అసలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆ నేత ఎవరు..?
అన్న ప్రణయ్ భాస్కర్ దగ్గర రాజకీయ ఓనమాలు నేర్చుకున్న దాస్యం వినయ్ భాస్కర్ మొదటిసారిగా హన్మకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2005 లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా… 2005-09 వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ లో కార్పొరేటర్ గా… 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారిగా ఎంఎల్ఏ గా గెలిచాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసి గెలుపొందాడు. 2014,2018 లో టీఆరెస్ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ 2019 సెప్టెంబర్ 7న ప్రభుత్వ చీఫ్ విప్ గా నియమితులయ్యారు. వినయ్ భాస్కర్ అన్న ప్రణయ్ భాస్కర్ ఎన్టీరామారావు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. అన్న మాదిరిగానే తాను కూడా మంత్రి నవ్వాలనేది వినయ్ భాస్కర్ కల. మంత్రి పదవి దక్కించుకోవాలని తాను ఎంత ప్రయత్నం చేసినా చివరకు చీఫ్‌విప్ గా నే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తానికి అటూ ఇటుగా వినయ్ ని పదవి వరించినా ప్రజలకు మాత్రం చేసింది ఏమి లేకపోవడం తో వరంగల్ పశ్చిమ నియోజక ప్రజలు తలలుపట్టుకుంటున్నారటా.. ఎలక్షన్లు రాగానే ఏదో ఒక హడావుడి చేయడం తప్ప… తమకు చేసిందేమి లేదంటూ నియోజక వర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
నియోజక వర్గంలో చాలా పనులు అభివృద్ధికి నోచుకోలేదని వాపోతున్నారు. కాజీపేట బ్రిడ్జ్ పరిస్థితి అలాగే ఉంది. కాజీపేట ఆర్వోబీ కాలపరిమితి అయిపోయినా కూడా శంకుస్థాపనలతో నే కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు తప్ప కొత్త బ్రిడ్జ్ పనులు మాత్రం ఇంతవరకు మొదలవ్వలేదు. బ్రిడ్జ్ పైన ఒక బస్సో లేదా లారో ఆగిపోయిందంటే ఇక అంతే సంగతులు. కనీసం గంటన్నర పాటు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం తో వాహనదారులు ఇబ్బంది పడాల్సిందే. ముఖ్యంగా వరంగల్ టు హైదరాబాద్ ప్రధాన జాతీయ రహదారి అయిన హన్మకొండ బస్టాండ్ ప్రాంతం చూస్తే ఎవ్వరైనా ఆశ్యర్య పో వాల్సిందే. గుంతలు తప్ప అసలు రోడ్ మాత్రం కనపడదు. వర్షం పడితే చాలు రోడ్డంతా ఎక్కడ గుంతలు ఉన్నాయో వెతుక్కొని వెళ్లాల్సిన పరిస్థితి. నిత్యం అదే రోడ్డు లో ప్రయాణం చేసే వారిలో వినయభాస్కర్ కూడా ఒకరు. అయినా అతనికి మాత్రం ప్రజల కష్టాలు కానరావడం లేదంటున్నారు ప్రజలు. ఇక వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ప్రజలకు ఉన్న మిషనరీ హాస్పిటల్, టీబీ హాస్పిటల్లోనయితే రోగుల పరిస్థితి దారుణంగా ఉంటుంది.
హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక అటు ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లే స్థోమత లేక నానా అవస్థలు పడుతుంటారు. హన్మకొండ విద్యకు పెద్దదిక్కుగా ఉందని… చదువుకు పెద్ద పీట వేస్తున్నాం అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం వినయ్ నియోజక వర్గంలో మాత్రం వెనుకపడింది. ఎస్సీ,ఎస్టీ, వసతి గృహాల పరిస్థితి అయితే చెప్పనలవి కాదు. అసలే చలికాలం… కప్పుకోవడాని దుప్పట్లులేక… తినడానికి తిండి సరిగా లేక….విద్యార్ధులు దీన పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నారు. ఇక పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మాటే వినిపించడం లేదు. నాలాలు మోరీల పరిస్థితి చూస్తే చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. కేసీఆర్ కు గురువైన ప్రొఫెసర్ జయశంకర్ పార్క్… కాళోజి కళాక్షేత్రం అయితే కనుమరుగయ్యాయి. పనులు సగంలో ఆగిపోయి సంవత్సరాలు గడుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల కష్టాలు చాలానే ఉన్నాయి.
మరి వినయ్ భాస్కర్ ఇప్పటికైనా తన నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరిస్తారో లేక చూసీ చూడనట్టు తిరుగుతూ పదవీ కాలాన్ని గడిపేస్తారో చూడాలి మరి!