తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి… పాటతో ఉన్న సంబంధం ప్రత్యేకమైనది. స్వరాష్ట్ర పోరాటంలో పాట పెట్రోలై మండింది. ఉద్యమకారుల ఉత్సాహానికి కారణం అయ్యింది. పాటకు ఎంత పదును ఉందో… పాట ప్రభావం ఎంత ఉంటుందో కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే కేసీఆర్ ముఖ్యమైన కవి,గాయకులను పిలిచి తరుచూ మాట్లాడారు.
కానీ ఇప్పుడు పాట మర్లబడుతుంది. ఎవడి పాలయ్యిందో తెలంగాణ… ఎవడేలుతున్నడురో తెలంగాణ అంటూ గొంతెత్తి పాడిన ఏపూరి సోమన్న ఇప్పటికే షర్మిల పార్టీలో చేరగా, టీఆర్ఎస్ ఆస్థాన గాయకుడిగా ఉన్న పాటల ఊట సాయిచంద్ కూడా తన అసంతృప్తిని వెల్లగక్కాడు. బట్టేబాజ్, బద్మాష్ గాళ్లకు రెండుసార్లు పదవులొచ్చినయి. కానీ నాకు రాలే… తెలివి ఎక్కువ ఉందని ఇస్తలేరు… తెలివి తేటలుంటే భయపడతరు… పదవి రాదు. దానికి నేనే ఉదాహరణ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించాడు.
నిజానికి టీఆర్ఎస్ తరుపున గజ్జెకట్టి, పాటపాడి… తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించిన నేరెళ్ల, రసమయి కూడా టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శించిన వారే.