ఎంకి పెళ్లి సుబ్బు చావుకొచ్చినట్టుంది హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదాతో టీఆర్ఎస్‌లో సీనియర్ల పరిస్థితి. తాజా పరిణామంతో గులాబీ బాస్ కేసీఆర్ ఖుషీగా ఉన్నా.. లీడర్లు మాత్రం తెగ గుస్సా అవుతున్నారు. అందుకు పెద్ద కారణమే ఉంది. ఎన్నికల సంఘం వాయిదా వేసింది కేవలం ఒక్క హుజూరాబాద్ ఉప ఎన్నికనే కాదు.. టీఆర్ఎస్‌లోని ఎంతో మంది సీనియర్లు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలని కూడా. ఎప్పుడో జూన్‌లో జరగాల్సిన ఎన్నికలని కరోనా సాకుతో, కేసీఆర్ తెలివిగా ముందుకు జరుపుతూ వస్తున్నారు. కనీసం హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో అయినా నోటిఫికేషన్ వస్తుందేమోలే అనుకుంటే.. సర్కార్ దాన్ని కూడా వాయిదా వేయించుకుంది. దీంతో ఆశావహులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.
కేసీఆర్ తమకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారో లేదో తేలితే, ఇక తమ దారి తాము చూసుకుందామనుకునే నేతలు టీఆర్ఎస్‌లో చాలా మందే ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో చేరాలని ఆహ్వానం ఉన్నా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. అయితే ఏదీ తేల్చకపోవడంతో అవతలి పార్టీలు కూడా ఆయా నేతలని పట్టించుకోవడం మానేస్తున్నాయి. దీంతో తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతోందని వారు వాపోతున్నారు. కేసీఆర్ ఇప్పటికే చాలా మందికి ఎమ్మెల్సీ పదవులపై హామీ ఇచ్చారు. పైగా వారు హామీ ఇచ్చిన ప్రతిచోట మరో నేత ఆశావహుల జాబితాలో ఉన్నారు.
ఉదాహరణకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో కోటిరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని మాటిచ్చారు కేసీఆర్. కానీ అదే జిల్లా నుంచి సుఖేందర్‌రెడ్డి రెన్యూవల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే.. ఈ జాబితా చాలా పెద్దగా ఉంది. మాజీ స్పీకర్ మధుసూదనచారి, మాజీ డిప్యూటీ సీఎం కడియం వంటి వారి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇక ఖమ్మంలో తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ పోస్టు కోసం వేయికళ్లతో ఎదరుచూస్తున్నారు. బొంతు రామ్మోహన్, దేశపతి శ్రీనివాస్ వంటి వారు ఈసారి ఎమ్మెల్సీ పదవి కోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తుండగా.. కొత్తగా పార్టీలో చేరిన ఎల్. రమణ, పెద్ది రెడ్డి, త్వరలో చేరబోయే మోత్కుపల్లి వంటి వారు కూడా ఆశలుపెట్టుకున్నారు. ఇందులో ఎవరికి ఇచ్చినా.. అధిష్టానానికి సెగ తప్పదు. పదవి రాకపోతే పార్టీ వీడేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే.. కేసీఆర్ తెలివిగా ముందుకు సాగుతున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి.