జాతీయ రాజకీయాలు అంటూ తిరుగుతున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈసారి రెండు వారాల పాటు అక్కడే ఉండి పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో టీఆర్‌ఎస్ ప్లీనరీ 27న నిర్వహిస్తున్నట్లు ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది.
ఈసారి మాదాపూర్ లోని హెచ్ఐసీసీలో టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 10 గంటల వరకు హెచ్ఐసీసీకి చేరుకోవాలని పార్టీ ప్రతినిధులందరికీ మెసేజ్ లు వెళ్లిపోయాయి. మంత్రివర్గం నుంచి కిందిస్థాయి మండల అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లతో సహా అందరికీ ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
27న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు పార్టీ ప్రతినిధుల పేర్ల నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఉదయం 11:05 గంటలకు కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుని జెండాను ఆవిష్కరిస్తారు. దాదాపు 11 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఆరోజు కేసీఆర్ ఏం మాట్లాడనున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
ఆమధ్య ప్రజలంతా అవసరమని కోరుకుంటే జాతీయ పార్టీ స్థాపించేందుకు రెడీ అని ప్రకటన చేశారు కేసీఆర్. ఇప్పుడు ఆ అంశంపై ప్లీనరీలో ఏదైనా ప్రకటన చేస్తారా? అనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే.. బీజేపీ మాత్రం ఆయన వల్ల ఏం కాదని కొట్టి పారేస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై స్పందిస్తూ.. కేసీఆర్ ఓటమి ఖాయమని అన్నారు. ఆయన ఏం చేసినా ఎవరూ నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.