హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార పార్టీ.. రాను రాను దిగజారిపోతోంది. ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. కుడి చేతితో పెట్టి ఎడమ చేతితో లాక్కున్నట్టుగా.. దళిత బంధు పేరుతో హుజూరాబాద్‌పై వేలకోట్ల రూపాయలు గుమ్మరించిన అధికార పార్టీ.. తిరిగి దాన్ని క్యాష్ చేసుకునే పనులు మొదలుపెట్టింది. ఊరూరా దళిత బంధు లబ్ధి పొందిన, పొందుతున్న ఎస్సీ కుటుంబాలతో ప్రమాణ పత్రాలు రాయించుకుంటోంది. టీఆర్ఎస్‌కే ఓటు వేస్తామని ఓట్టు వేయి0చి తీర్మానాలు వేయించుకుంటోంది.
టీఆర్ఎస్ నేతలు దగ్గరుండి..ఈ దుస్సాంప్రదాయానికి తెగబడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఉద్దేశించి..తీర్మాన పత్రం రాయించుకుని సంతకాలు పెట్టించుకుంటున్నారు. దళిత బంధు పథకం తీసుకుంటున్నప్పుడు ఓట్లు వేయాల్సిందేనన్నట్టుగా వారితో మాట్లాడుతున్నారు. దీంతో సంతకం పెట్టకపోతే ఏమవుతుందో.. తమకు దళిత బంధు రాదేమోనన్నభయంతో.. ఎస్సీ కుటుంబాలకు చెందిన ప్రజలు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టేస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అయితే.. పక్కనే ఉండి ఇలాంటి తతంగం నడిపిస్తున్నారని అంతటా చెప్పుకుంటున్నారు.
తీర్మాన లేఖలకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు హుజూరాబాద్ అంతటా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చదివితే.. ఆయా తీర్మాన పత్రాలు ఎందుకు రాయాల్సి వచ్చిందో..ప్రమాణం చేయాల్సి వచ్చిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఓటర్లను తమకే ఓటు వేయాలని బెదిరించడం, ప్రలోభపెట్టడం, భయపెట్టడం రాజ్యాంగ విరుద్ధం, ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకం అని తెలిసినా.. టీఆర్ఎస్ నేతలు మాత్రం అవేం పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళిత బంధు పథకం అమలు చేస్తే..ఓట్లు తమకే వేయాలని దౌర్జన్యం చేయడం ఏమిటని అంతా మండిపడుతున్నారు. మనసులో అభిమానం ఉంటే సరిపోదా.. తీర్మానాలు రాయించుకుని వారి మనోభావాలతో ఆడుకోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.