– తెరపైకి హుజూరాబాద్ పంచాయితీ
– ఈటలకు కౌశిక్ సవాల్..
– కౌశిక్ కు గెల్లు శ్రీనివాస్ ఛాలెంజ్
– పోటాపోటీగా ఫ్లెక్సీల వార్
– ఘర్షణకు దిగిన కార్యకర్తలు
ఓవైపు మునుగోడు పంచాయితీ నడుస్తుండగా అందరి చూపు అటు వైపే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? రాజగోపాల్ బీజేపీలో చేరిక ఎప్పుడు? టీఆర్ఎస్ ప్లానేంటి? ఇలా అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. ఈ టైమ్ లో హుజూరాబాద్ లో వార్ మొదలైంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అభివృద్ధిపై చర్చకు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి సవాల్ విసిరారు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి. ఈ మేరకు ఓ భారీ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు.
ఇటు బీజేపీ కూడా తగ్గేదే లే అంటూ రంగంలోకి దిగింది. పోటా పోటీగా హుజూరాబాద్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఎక్కడైతే బహిరంగ చర్చ అన్నారో ఆ ప్రాంతమంతా ఇరు పార్టీల జెండాలతో నిండిపోయింది. అధికారులు రంగంలోకి దిగి ఆ జెండాల్ని తొలగించారు. ఇరు పార్టీల కార్యకర్తలు భారీగా మోహరించారు. అదే సమయంలో గులాబీ కార్యకర్తలు ఒకింత అత్యుత్సాహం చూపారు. బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. టీఆర్ఎస్ క్యాడర్ దాడిలో ఓ పోలీస్ అధికారికి కూడా గాయాలయినట్లు సమాచారం.
అదనపు బలగాల్ని మోహరించి, ఇరు వర్గాల్ని అక్కడి నుంచి పంపించేశారు పోలీసులు. ప్రస్తుతం హుజూరాబాద్ పట్టణంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. బీజేపీ గెలుపుని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందన్నది కమలనాథుల వాదన. ఘర్షణపై స్పందించిన ఈటల.. ప్రగతి భవన్ కేంద్రంగా అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఈ నీచపు కుట్రలను, కేసీఆర్ బానిసల ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. ప్రశాంతమైన హుజూరాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఆనాడు మానుకోటలో ఉద్యమకారుల మీద రాళ్లు వేయించిన సైకోలకు ఎమ్మెల్సీ ఇచ్చారన్న ఆయన.. దమ్ముంటే సమస్యల మీద మాట్లాడాలి కానీ..దొడ్డి దారిన యుద్ధం చేయడం సిగ్గుచేటన్నారు. గజ్వేల్ లేదా హుజూరాబాద్ లో కొట్లాడుదామా? అని ఈటల సవాల్ విసిరారు. దమ్ముంటే సవాల్ స్వీకరించి రావాలి తప్ప చిల్లర పనులు చేసి అల్లరి చేసే ప్రయత్నం చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.
ఇదే సమయంలో హుజూరాబాద్ టీఆర్ఎస్ లో వర్గపోరు మొదలైంది. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున గెల్లు శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తులు చేస్తున్నారు. అయితే.. తాజాగా మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి.. తన వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి దమ్ముంటే తనపై గెలవాలని అన్నారు. కౌశిక్ రెడ్డి కామెంట్స్ తో గెల్లు శ్రీనివాస్ యాదవ్ అలర్ట్ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థిగా కౌశిక్ కాదు.. తానేనంటూ ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించారు.