– టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ
– బీజేపీ సాలు దొర సెలవు దొర కౌంట్ డౌన్
– టీఆర్‌ఎస్ సాలు మోడీ సంపకు మోడీ కౌంటర్
– సోషల్ మీడియాలో పోటాపోటీ వార్
– మోడీ రాక సమయంలో ఫ్లెక్సీ కలకలం
ప్రస్తుతం ఒకర్ని డ్యామేజ్ చేయాలన్నా.. ఒకర్ని దేవుడి రేంజ్ లో పాపులర్ చేయాలన్నా సోషల్ మీడియానే. ప్రతీ విషయానికి కాస్త గ్రాఫిక్స్ మసాలా యాడ్ చేసి ఫోటోలు, వీడియోలతో ప్రచారం చేసుకోవడం కామన్ అయింది. ముఖ్యంగా పొలిటికల్ పార్టీలు సోషల్ మీడియాను బాగా వాడేస్తున్నాయి. ఎదుటి పార్టీని తిట్టడానికి.. తమను హైలెట్ చేసుకోవడానికి స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసుకుని మరీ పోస్టులు పెడుతున్నాయి.
కేసీఆర్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైందని.. ఈమధ్యే బీజేపీ సాలు దొర సెలవు దొర అనే సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్ ను, బగ్ ను ప్రారంభించింది. ట్విట్టర్ లో వందలు, వేలల్లో ట్వీట్లు చేస్తూ.. దీన్ని ట్రెండింగ్ లోకి తీసుకెళ్లింది. కేసీఆర్ వైఫల్యాలను సోషల్ మీడియా బజార్లో పడేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా.. ఇలా ప్రతీ ప్లాట్ ఫాంలో సాలు దొర సెలవు దొర పోస్టులు పెడుతున్నారు. దాని ఫలితంగా టీఆర్‌ఎస్ కు ఫుల్ డ్యామేజ్ జరిగిపోతోంది.
టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం ఏం తక్కువ కాదు. సాలు మోడీ సంపకు మోడీ, బైబై మోడీ అనే హ్యాష్ ట్యాగ్ లతో రెచ్చిపోతోంది. మోడీ, బీజేపీ టార్గెట్ గా టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్ లో అయితే.. ఏకంగా ఫ్లెక్సీ పెట్టేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం మోడీ జులై 2న నగరానికి వస్తున్నారు. 2, 3 తేదీల్లో కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెరేడ్ గ్రౌండ్ లో ప్రధాని బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మోడీ రాకను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో సాలు మోడీ సంపకు మోడీ అనే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిపై బై బై మోడీ అనే హాష్ ట్యాగ్ ను కూడా జతచేశారు. టివోలీ థియేటర్ ఎదురుగా ఈ ఫ్లెక్సీ పెట్టారు. అంతేకాదు.. రైతు చట్టాలు తెచ్చి అన్నదాతలను చంపినవ్, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగం అని యువత కడుపు కొట్టినవ్, హఠాత్తుగా లాక్ డౌన్ అని గరీబోళ్లను చంపినవ్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్ అని రాశారు. ఇది ముమ్మాటికీ టీఆర్‌ఎస్ శ్రేణుల పనే అని అంటున్నారు. సోషల్ మీడియాలో సాలు మోడీ, బై బై మోడీ హ్యాష్ ట్యాగ్ లతో పోస్టులు పెడుతూ.. ఇప్పుడు ఫ్లెక్సీ పెట్టారని చెబుతున్నారు.