టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఫైటింగ్ కు దిగారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్ దీనికి వేదికైంది. 41వ ఘట్ కేసర్ రైతుసేవ సహకార సంఘం మహజన సర్వసభ్య సమావేశంలో రైతుల లోన్లు, వడ్డీల విషయంలో మంత్రి మల్లారెడ్డిని నిలదీశారు కాంగ్రెస్ నాయకులు.
టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన లోన్ల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు అధికారులు అధికారిక లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు. దీంతో రచ్చ మొదలైంది.
టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ఇరువర్గాలు మాటల యుద్ధానికి దిగాయి. మల్లారెడ్డితోపాటు జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడే ఉన్నారు.
పోలీసులు ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే చివరకు కాంగ్రెస్ నేతలను బయటకు పంపారు. దీంతో వారంతా బయట రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. తర్వాత కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు.