ఓవైపు రాహుల్ ఓయూ టూర్ పై రచ్చ కొనసాగుతుండగా.. ఇంకోవైపు పార్టీ వీడియోపై వివాదం మొదలైంది. రాహుల్ గాంధీకి సంబంధించిన ఆ వీడియోని బేస్ చేసుకుని బీజేపీ, టీఆర్‌ఎస్.. కాంగ్రెస్ ను టార్గెట్ చేశాయి. ఇప్పటికే ఓయూ పర్మిషన్ విషయంలో అసంతృప్తిలో ఉన్న హస్తం నేతల కోపాగ్నికి ఈ కామెంట్స్ ఆజ్యం పోసినట్లుగా మారింది. వారు కూడా అదేస్థాయిలో రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.
రాహుల్ గాంధీ పార్టీ వీడియోపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ స్పందించారు. రాహుల్ ఓయూకి వెళ్తే పబ్ గురించే మాట్లాడతారేమో అని సెటైర్లు వేశారు. ఆయన యూనివర్సిటీకి వెళ్తే విద్యార్థులు చెడిపోతారని అన్నారు. అక్కడి ఎడ్యుకేషన్ దెబ్బతింటుందని చెప్పారు. ఇక పర్మిషన్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపైనా స్పందిస్తూ.. ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అంతా వీసీ నిర్ణయమని చెప్పారు. వర్సిటీకి ఎవరొస్తే ఎవరొస్తే బాగుపడుతుంది.. ఎవరొస్తే చెడిపోతుందనేది వారికే బాగా తెలుసని అన్నారు దయాకర్.
ఇక బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు దీటైన జవాబు ఇచ్చారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఫంక్షన్‌కు వెళ్ళిన చోట ఏముందో రాహుల్ గాంధీకి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. అక్కడ జరిగేదానికి ఆయనకు ఏం సంబంధమని అన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు చిల్లరగాళ్లని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ పెళ్లి ఫంక్షన్ కు వెళ్ళిన వీడియోలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది దుర్మార్గమని.. చిల్లర రాజకీయాలు మానాలని హితవు పలికారు. మీరంతా రాత్రి పూట ఎక్కడికి వెళుతున్నారో బయట పెట్టమంటారా? అంటూ బీజేపీ, టీఆర్‌ఎస్ నేతలను హెచ్చరించారు జగ్గారెడ్డి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన పక్కన ఓ మహిళ కనిపిస్తోంది. ఆమె నేపాల్ లో చైనా రాయబారి హో యాంకి అంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ నేతలు కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ నేతలు ఎటాక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగ్గారెడ్డి తనదైన స్టయిల్ లో కౌంటర్లు వేశారు.