మునుగోడు బై ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది. దీంతో హైకోర్టుకెళ్లింది గులాబి పార్టీ. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన మరో 8 గుర్తులను తొలగించాలంటూ హైకోర్టుకు వెళ్లింది కేసీఆర్ సర్కార్. హౌజ్ మోషన్ విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని శనివారం కోరగా.. న్యాయమూర్తి ఇంట్లో అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది.
దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని శనివారం నిర్ణయించింది. 8 గుర్తులను మునుగోడు ఉపఎన్నికలో కేటాయించొద్దని ఇప్పటికే టీఆర్‌ఎస్ పార్టీ ఈసీకి లేఖ రాసింది. ఈసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తెలంగాణ హైకోర్టును టీఆర్‌ఎస్ పార్టీ ఆశ్రయించింది. గుర్తుల జాబితా నుంచి కెమెరా, చపాతీ రోలర్, డోలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలంటూ కోరుతూ ఈ నెల 10న ఎన్నికల కమిషన్ ను టీఆర్ఎస్ కోరింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
గతంలో 2018 ఎన్నికల్లో కూడా కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజక వర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ 8 గుర్తులను తొలగించాలని కోరారు. సోమవారం లంచ్ మోషన్ కు అనుమతి కోరి పిటిషన్ వేసేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది.
కాగా మునుగోడు బై ఎలక్షన్స్ దగ్గరపడే కొద్దీ పొలిటికల్ వ్యూహాలు మరింత పదునెక్కాయి. సెమీఫైనల్‌గా భావించే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓ వైపు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే.. మరోవైపు ప్రత్యర్ధి పార్టీలపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. రాజకీయనేతల ఆరోపణలు, కౌంటర్లతో ప్రచారం పీక్స్‌కు వెళ్లింది. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.