టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ భేటీ రాబోయే పార్లమెంట్ సమావేశాల సన్నద్ధతనే కాదు, టీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ లీడర్‌ను ప్రమోట్ చేసిందని సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ హజరుకావాల్సిన భేటీకి కేటీఆర్ రావటం, పైగా కేటీఆర్ ఈ భేటీలో చేసిన కీలక వ్యాఖ్యలు అందుకు ఊతం ఇస్తున్నాయి.
పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో కేటీఆర్ పలు అంశాలను ప్రస్తావిస్తున్న సమయంలో పలువరు ఎంపీలు ఓ కీలక సమస్యను లేవనెత్తారు. మేమంతా పేరుకే ఎంపీలం అయిపోయాము. మాకు జిల్లాలకు వెళ్లినా, హైదరాబాద్‌లో ఉన్నా, ఢిల్లీలో ఉన్న కనీస గౌరవం దక్కటం లేదు. మేము ఉత్సవవిగ్రహాల మాదిరి తయారైపోతున్నాం… మన మంత్రులు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే ఎలా అంటూ పలువురు ఎంపీలు కేటీఆర్‌తో తమ గోడు వెళ్లబోసుకున్నట్లు చర్చ జరుగుతోంది. మా నియోజకవర్గాల్లోనూ మా మాట చెల్లుబాటు కావటం లేదని ఎంపీలు కేటీఆర్ దృష్టికి తెచ్చినట్లు ప్రచారం జోరందుకుంది.
అయితే, కేటీఆర్ కూడా ఇలాంటి సమస్యలుంటే నా దృష్టికి తీసుకరండి. నేను మీకు అండగా ఉంటా… సీఎం కేసీఆర్‌తో చెప్పుకోవాలి అనుకునే విషయాలు కూడా చెప్పండి… వెంటనే పరిష్కరించే అవకాశం ఏమాత్రం ఉన్నా అక్కడికక్కడే మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా, అంతేకానీ ఇలాంటి వాటితో అసంతృప్తి ఎందుకు అని కేటీఆర్ చెప్పినట్లు టీఆర్ఎస్ భవన్ వర్గాలంటున్నాయి.
కేటీఆర్ చేసిన కామెంట్స్‌తో పాటు, ఎంపీలకు దిశానిర్దేశం చేసే సమావేశానికి కేటీఆర్‌ను పంపటం చూస్తుంటే… రాష్ట్రంలో కేటీఆర్‌కు పగ్గాలు అప్పజెప్పే ఆలోచన మళ్లీ తెరపైకి వచ్చినట్లు కనపడుతోందంటున్నారు విశ్లేషకులు. సంచలన నిర్ణయాలు తీసుకోవటంలో కేసీఆర్ ముందుంటారని, పార్టీ నేతలను మానసికంగా ఇలా సిద్ధం చేస్తుండొచ్చని అభిప్రాయపడుతున్నారు.