ఆర్టీసీ కార్మికులందరూ ట్విట్టర్ వైపు చూస్తున్నారు. ట్విట్టర్ ద్వారా నిత్యం ఏ సమస్య అయినా, ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించే మంత్రి… తమ సమ్మె మీద ఎప్పుడు స్పందిస్తాడో…ఎలా స్పందిస్తాడో…అని ఎదురు చూస్తున్నారు. కాని సమ్మె మొదలై నలబై రోజులు దాటింది. అయినా। నేటివరకు ఆ మంత్రి అకౌంట్ లో ఎటువంటి స్పందన కనపడలేదు…ఈ విషయంలో ఆయన ఎకౌంట్ మూగపోయింది.
ట్విట్టర్ లో ఆర్టీసీ సమ్మె మీద ట్వీట్ చేద్దామంటే ఆర్టీసీ, సమ్మె అనే పదాలు ఆయనకు టైప్ కావడం లేదా? లేక, సమ్మె మీద ట్వీట్ చేద్దామంటే ఆయనకు చేతులు ఆడడం లేదా? లేక ఆ మంత్రికి మనస్సు రావడం లేదా? ఆర్టీసీ సమ్మె మీద ట్వీట్ చేసే ధైర్యం లేదా? ఎమైంది? రెగ్యులర్ గా ట్వీట్ చేసే మంత్రికి ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే… ఎందుకు ఇప్పటి వరకు స్పందిచలేదు అని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మా కార్మికుల ఆత్మహత్యలు కనపడడం లేదా, వారి కుటుంబసభ్యుల ఆర్తనాదాలు…వారి ఆకలి కేకలు ఆయనకు వినబడడం లేదా అని కార్మికలోకం ప్రశ్నిస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తే… యువకులు ఆత్మబలిదానాలు చేసుకుంటే, వాటిని మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న సందర్భాలు మీకు గుర్తు రావడం లేదా? నాడు సకలజనుల సమ్మె సందర్భంగా…మీరు మాతోపాటు డిపోలముందు ధర్నాలు చేసి… మీరు ఇచ్చిన ఉపన్యాసాలు, మీరు మరిచిపోయిన మేము మాత్రం మరిచిపోలేదు.
నేడు ఆర్టీసీ కార్మికులు తమ కడుపులు నింపాలని, మాకు న్యాయం చేయాలని సమ్మె చేస్తుంటే మీ ప్రభుత్వం కసాయి వాడిలా వ్యవహరిస్తూ వారి ఆత్మహత్యలకు కారణం అవుతుంటే ఎందుకు నీ ట్విట్టర్ అకౌంట్ పనిచేయడంలేదు..? నీవు గొప్ప మానవతావాదివిగా? నీ ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఎవరైనా అభాగ్యులు, అనాధలు తమకు ఆరోగ్యం బాగలేదు, తమకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు అని ట్వీట్ చేస్తే వెంటనే…వారికి స్పందించి, వారిని అక్కున చేర్చుకుని సహాయం చేస్తున్నట్లు, నీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వారికి మనోధైర్యం ఇచ్చి సహాయం చేస్తునట్టు చెప్పారు. అలాంటి మీరు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు చనిపోతుంటే, వేల కుటుంబాలు పస్తులతో ఉంటుంటే…మీకు ఎందుకు కనపడటంలేదు…?
సమ్మె మొదలై నలబై రోజులు దాటుతున్నా… ఒక మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా, అధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిత్యం ట్విట్టర్ లో స్పందించే మీరు ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదు? మీరు యంగ్ డైనమిక్ లీడర్ అని అందరూ అంటుంటారు. యంగ్ డైనమిక్ లీడర్ అంటే తప్పించుకుని తిరగడం కాదు కదా… సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలగాలి. నిత్యం హైదరాబాద్ లో ప్రారంభోత్సవాలు చేస్తూ… రోడ్ల మీద తిరిగే మీకు ఆర్టీసీ కార్మికుల ఆర్తనాదాలు, వారి ఆకలికేకలు వినబడడం లేదా…? లేక వినపడినా…వినపడనట్లుగా నటిస్తున్నారా..? ఇప్పటికైనా మీ ట్విట్టర్ అకౌంట్ కు పని చెప్పండి.
ఇట్లు
మీ ఆర్టీసీ కార్మికులు
అంటూ ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.