ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో నెలకొన్న పంచాయితీ పార్టీ పెద్దల్లో గుబులు రేపుతోంది. పార్టీలో ఉన్న గ్రూపుల కారణంగానే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని పార్టీ పెద్దలు బలంగా విశ్వసించారు. కానీ ఆ తర్వాత నామా నాగేశ్వరరావు పార్టీలో చేరటంతో గ్రూపులు మరింత ముదిరాయి. మాజీ ఎంపీ పొంగులేటి, నామా, పువ్వాడ అజయ్, తుమ్మల గ్రూపులుగా ఖమ్మం టీఆర్ఎస్ విడిపోయిందన్న ప్రచారం స్థానికంగా బలంగా ఉంది.
ఓవైపు ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు, మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో… ఖమ్మంలో తిరగాలంటే పాస్ పోర్టు ఉండాలా అంటూ పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో గ్రూపు రాజకీయం తారాస్థాయికి చేరినట్లు బట్టబయలైంది. తమను కలుపుకొని పోవటం లేదని, తమ వర్గాన్ని అణచివేసే కుట్ర ఉందని పార్టీ పెద్దలకు ఫిర్యాదులు అందాయి. మరోవైపు గ్రూపు రాజకీయాలు పార్టీ గెలుపుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని, కొందరు నాయకులు పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు.
దాదాపు 40మంది ముఖ్య నేతలను పిలిపించుకొని సమావేశం నిర్వహించారు. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి, ముఖ్య నాయకుల మధ్య సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చి, ఖమ్మం గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు ప్రత్యేక మ్యానిఫెస్టోకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చలు జరగనున్నాయి.