ట్రక్కెళ్లి కారును ఢీకొంటే...? - Tolivelugu

ట్రక్కెళ్లి కారును ఢీకొంటే…?

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ కు మరో కష్టం వచ్చిపడింది. తన రాజకీయ చతురతతో ప్రత్యర్థి పార్టీలను సైతం దారికి తెచ్చుకున్న గులాబీ బాస్‌కు… ఇప్పుడు ఆ కీలక సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. తలపండిన ప్రత్యర్థులు ఎలాంటి షాకిస్తారోనని గులాబీ శ్రేణులకు గుబులు పట్టుకుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో “కారు” గుర్తు అభ్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన ఆ “గుర్తులే” ఇప్పుడు మళ్లీ తెరపైకొస్తాయన్న ఆందోళన నెలకొంది. దీంతో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఓ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

హుజూర్ నగర్ ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు చావో రేవోలా తయారైంది. గెలుపు కోసం ఎవరికి వారే ఎత్తులు వేస్తున్నారు. రాష్ట్ర నేతలే కాదు జాతీయ నేతలు కూడా ఇక్కడ మకాం వేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టారు. ముఖ్యంగా అధికార పార్టీ అయితే ఈ ఎన్నికను మరింత సవాల్ గా తీసుకుంది. మండలానికో మంత్రిని ఇంచార్జ్ గా నియమించడంతో పాటు కులానికో నేతను కూడా ఇంచార్జ్ లుగా నియమించి గెలుపు కోసం ఓ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. తప్పిదాలకు తావు లేకుండా పక్కా వ్యూహం తో ముందుకెళ్తోంది.  మరి ఈ ప్లాన్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందన్నది పక్కన పెడితే… గులాబీ దళపతికి కొత్త తలనొప్పులు వచ్చి పడ్డాయట. కారు గుర్తును పోలిన గుర్తులు పెద్ద తంటాలు తెచ్చి పెడుతున్నాయని టీఆరెఎస్‌ నేతలు మదనపడుతున్నారు.  గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ పరిణామం టీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టాన్ని మిగిల్చింది.

2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రకు చెందిన ఫార్వాడ్ బ్లాక్ ఆఫ్ ఇండియా పార్టీ ఎంటరిచ్చింది. ఇది కాంగ్రెస్ నేతల ఎత్తుగడని టాక్. ఈ పార్టీ గుర్తు ట్రక్కు. అచ్చం కారు గుర్తును పోలి ఉంటుంది. కానీ దీన్ని టీఆర్ఎస్ పసిగట్టలేక పోయింది.ఈ ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్,నకిరేకల్ తో పాటు రాష్ట్రంలో సుమారు 8 నియోజకవర్గాల్లో పడింది. ఆ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో ట్రక్కు ధాటికి కారు తుక్కయ్యింది. అయితే ఈవీఎంలో అచ్చం కారు గుర్తుతో ట్రక్కు గుర్తు పోలి ఉండడంతో ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారు. కారుపై అభిమానం కాస్తా అవగాహన లేక, ట్రక్కు వైపు మళ్లింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో కారు గుర్తు అభ్యర్థులు బలయ్యారు. ఈ విషయంపై గులాబీ దళపతి ఆవేదన వెళ్లబుచ్చారు. అంతేకాదు దీనిపై కేంద్ర ఎన్నికల కమీషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇక గులాబీ శ్రేణుల ఫిర్యాదు మేరకు ట్రక్కు గుర్తును తొలగించడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు వ్యూహం మార్చారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తమ వ్యూహానికి పదును పెట్టారు. కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో నిలిపారు. సహజంగానే ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఒక్కరికైనా రోడ్డు రోలర్, ఆటో గుర్తులు కేటాయిస్తారు. ఇక్కడ కూడా కారు మరో సారి పల్టీ కొట్టింది. ఈ ప్రభావంతో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు ఉదాహరణగా భువనగిరి పార్లమెంట్ ఫలితాలనే చెప్పుకోవచ్చు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి 28 వేల ఓట్లు పడ్డాయి. ఆయన గుర్తు రోడ్డు రోలర్ గుర్తు. సదరు అభ్యర్థి జనాలకు సుపరి చితుడు కాదు… ఎక్కడా ఆయన ప్రచారం చేసిన దాఖలాలూ లేవు. కేవలం కారుకు పడాల్సిన ఓట్లు.. పొరపడి రోడ్డు రోలర్ గుర్తుకు పడ్డాయనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. అక్కడ రోడ్డు రోలర్ గుర్తు ఉన్న అభ్యర్థికి 28 వేల ఓట్లు పడడం,టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం 4 వేల ఓట్లతో ఓటమి చెందడం గులాబీ శ్రేణులకు మింగుడు పడని అంశంగా మారింది. అంతేకాదు ఈ ప్రభావంతో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గట్టెక్కినా మెజార్టీ మాత్రం తగ్గింది. దీంతో ఇలాంటి అనుభవాల దృష్యా హుజూర్ నగర్ లో కూడా ఆ సీన్ రిపీట్ అవుతుందోననే భయం అధికార పార్టీ నేతలను వెంటాడుతోంది.

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలనలో ఎగిరిపోయి, నామినేషన్ లు ఉపసంహరించుకోగా సుమారు 20 నుంచి 30 మంది అభ్యర్దులు బరిలో ఉండే ఛాన్స్ ఉంది. ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఒక్కరికైనా కారు గుర్తుతో పోలి ఉండే గుర్తులు కేటాయించించేది అనివార్యమే. దీంతో వృద్ధులు, కంటి చూపు తక్కువున్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశముందనే ఆవేదనతో ఉన్నారు గులాబీ శ్రేణులు. దేవుడిపై భారం తప్పా ఏం చేయలేని పరిస్థితి వారిది. మరి గతంలో ఆయా నియోజకవర్గాల్లో నాలుగు టైర్ల వాహనం ధాటికి బోల్తా పడుతున్న కారు… ఈ హుజూర్ నగర్ లో సేఫ్ గా గమ్యం చేరుతుందో లేదో చూడాలి. ఇటు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అగ్రనేతలంతా ప్రచారం స్పీడప్ చేయడంతో పాటు ఈవీఎంలో కారు యాక్స్ డెంట్ కాకుండా పూజలు కూడా మొదలెట్టారేమో అన్న సెటైర్లు నియోజకవర్గంలో గట్టిగానే వినపడుతున్నాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp