రాహుల్ గాంధీ ఓయూ టూర్ పై వివాదం కొనసాగుతోంది. వీసీ పర్మిషన్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన్ను వర్సిటీకి తీసుకొస్తాం.. విద్యార్థులతో మాట్లాడిస్తామని తెగేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 7న ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొనగా.. టీఆర్‌ఎస్వీ నాయకులు రంగంలోకి దిగారు.
ఓయూలోకి రాహుల్ అడుగుపెట్టడానికి వీల్లేదని అంటున్నారు టీఆర్‌ఎస్వీ నాయకులు. ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన తర్వాతే రాహుల్ ఓయూకు రావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యమ సమయంలో ఓయూ.. ఏనాడూ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నిస్తున్నారు నేతలు. అయినా.. ఏ ముఖం పెట్టుకుని వస్తారని.. ప్రశాంతంగా ఉన్న యూనివర్సిటీ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. అయితే.. సీఎం దిష్టిబొమ్మ దగ్ధం అనగానే ముందే వచ్చే పోలీసులు.. రాహుల్ దిష్టిబొమ్మ పూర్తిగా దగ్ధం అయ్యే వరకు కనిపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మే 6న రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మొదటిరోజు వరంగల్ లో రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. 7న కాంగ్రెస్ నేతలతో భేటీలు ఉంటాయి. అదేరోజు ఓయూకి ఆయన్ను తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు నేతలు. అయితే.. వర్సిటీ అధికారులు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వమే కావాలని అడ్డుకుంటోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. అటు టీఆర్‌ఎస్ నేతలు కూడా అదేస్థాయిలో ఎటాక్ ను కొనసాగిస్తున్నారు.