అసెంబ్లీలో సోమవారం టీఆర్ఎస్ వర్సెస్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ నడిచింది. సాగునీటిపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్, రాజగోపాల్ రెడ్డిల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ రసాభాసగా మారింది.
ఓ దశలో రాజగోపాల్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఓ కాంట్రాక్టర్ అంటూ తలసాని అన్నారు.
దీనిపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా మంత్రి తలసానిపై కోమటి రెడ్డి నిప్పులు చెరిగారు. పేకాట ఆడే వ్యక్తి మంత్రి అవ్వగా లేనిది కాంట్రాక్టర్ అయితే అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.
దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే స్పీకర్ కలుగ జేసుకుని ఇరువురి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలో మంత్రికి క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.