అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ విషయంలో ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది. క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని దృష్టిలో ఉంచుకొని ఆయన ఫేస్‌బుక్ ఖాతాపై ఇప్పటికే విధించిన 24 గంటల నిషేధాన్ని పొడిగించింది. ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అధ్యక్ష పదవి అధికార మార్పిడి సజావుగా ముగిసేవరకూ ( రెండు వారాలు) ట్రంప్ ఖాతాపై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
క్యాపిటల్ భవనం వద్ద జరిగిన సంఘటనలపై విచారణ వ్యక్తం చేసిన జూకర్ బర్గ్.. అందుకు ఫేస్‌బుక్‌ను కూడా ట్రంప్ ఉపయోగించుకోవడాన్ని తప్పుబట్టారు. తన మద్దతుదారులను వారించాల్సిందిపోయి.. వారిని మరింత రెచ్చగొట్టేలా ట్రంప్ ఫేస్‌బుక్ ద్వారా పిలుపునివ్వడం ప్రపంచాన్ని కలవరపరిచిందన్నారు జూకర్ బర్గ్. ఇప్పటికే విద్వేషాలకు తావిచ్చేలా ఉన్న ట్రంప్ ప్రకటనల్ని ఆయన ఆకౌంట్ నుంచి డిలీట్ చేశామని స్పష్టం చేశారాయన. ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై విధించిన బ్యాన్‌ను కూడా మరికొంత కాలం పొడిగించనున్నట్టు జూకర్ బర్గ్ తన ప్రకటనలో వెల్లడించారు.