అమెరికా అధ్యక్షుడి రాకతో ఆఘమేఘాల మీద సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. ఈనెల 24 నుంచి రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసం ఆయన పర్యటించే అహ్మదాబాద్, ఆగ్రా ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గుజరాత్ లోని ఎయిర్ పోర్ట్ నుంచి సర్దార్ వల్లభాయ్ స్టేడియం వరకు దాదాపు రెండు కిలో మీటర్ల దారిలో ఉన్న మురికివాడలు కనిపించకుండా గోడ కడుతున్నారు. 7 ఫీట్ల గోడ నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్ మెంట్…బులంద్ షహర్ లోని గంగానహర్ నుంచి 500 క్యూసెక్కుల నీటిని యమునా నదిలోకి విడుదల చేసింది. మథుర గుండా నీళ్లు యుమునా నదిలో కలుస్తాయి. ఆగ్రాలో ట్రంప్ పర్యటించనున్నందున యమునా నదిలో ”పర్యావరణ పరిస్థితులను” మెరుగు పర్చడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ నీళ్లు ఈ నెల 21న ఆగ్రాలోని యమునా నదిని చేరుకుంటాయని ఇరిగేషన్ ఎస్.ఇ ధర్మేందర్ సింగ్ పోగట్ తెలిపారు. ఫిబ్రవరి 24 వరకు యమునా నదిలో కొంత స్థాయి వరకు నీళ్లు చేరడం వల్ల చెడు వాసన తగ్గుతుందని చెప్పారు.500 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేయడం వల్ల యమునా నదిలో కొంత ప్రభావం ఉంటుందని..ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుందన్నారు. అయితే ఈ నీళ్లు తాగడానికి పనికి రావని అధికారులు తెలిపారు.